Gurukula Schools | హైదరాబాద్, ఆగస్టు10 (నమస్తే తెలంగాణ) : నిన్నమొన్నటిదాకా దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు, ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయంతో వణికిపోతున్నాయి. ఓ వైపు ఫుడ్‌పాయిజన్, మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యల వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్నాయి. పాముకాట్లు, ఎలుకకాట్లు, కలుషిత ఆహారంతో పిల్లలు దవాఖానల పాలుకావడం, పరిస్థితి విషమించి పిట్టల్లా రాలిపోవడం, అనుమానాస్పద మరణాలు చోటుచేసుకోవడం, బలవన్మరణాలకు పాల్పడటం ఇటీవల కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్నది.
సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ గురుకులం ఇలా దేనిలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఘటన జరిగిన వెంటనే హడావుడి చేయడం, తూతూమంత్రంగా ఎంక్వయిరీ కమిటీ వేయడం, కంటితుడుపుగా వార్డెన్నో, లేదా ప్రిన్సిపాల్నో సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.
అంతేతప్ప కారణాలేమిటి? ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.? కారకులెవరు? పరిష్కార మార్గాలేంటి? అన్న అంశాలపై ఇటు ఉన్నతాధికారులకు గానీ, అటు సర్కారుగానీ దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస ఘటనలపై ఇప్పటికీ బీసీ సంక్షేమశాఖకు మంత్రి ఉన్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉన్నదో తేటతెల్లమవుతున్నది. 8 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలకు మంత్రి దిక్కులేక వాటి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
జనవరి 22: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థి భార్గవి ప్రార్థన సమయంలో కింద పడిపోయింది. దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయింది.
ఫిబ్రవరి4 : భువనగిరి పట్టణంలోని ఎస్సీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్న హబ్సీగూడకు చెందిన ఇద్దరు బాలికలు భవ్య, వైష్ణవి ఒకేరోజు ఆత్మహత్య చేసుకున్నారు.
ఫిబ్రవరి 10: సూర్యాపేటలో జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకులంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పదంగా చనిపోయింది.
ఫిబ్రవరి 18: ఇదే గురుకులానికి చెందిన విద్యార్థి అస్మిత ఇంటివద్ద బలవన్మరణానికి పాల్పడింది.
ఏప్రిల్16: భువనగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థి ప్రశాంత్ చనిపోయాడు. భువనగిరి జిల్లాలోనే బొమ్మలరామారం, గుండాల, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు వసతి గృహాల్లోనూ ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి.
జూలై12: కొత్త గూడెం జిల్లాలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో సుజాతనగర్ మండలం గరీబ్‌పేటకు చెందిన 5వ తరగతి విద్యార్థి బుర్ర లిడి యా (12) జ్వరంతో ఇంటికి వెళ్లింది. తర్వాత ఊహించని రీతిలో బాలిక ఉరేసుకున్నది.
ఆగస్టు 8: మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం నంచర్ల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదేరోజున ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి కొయ్యడ కార్తీకశ్రీ గురుకుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఆగస్టు 9 : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి విద్యార్థి అడ్మాల అనిరుద్ (11) చనిపోయాడు. అదే తరగతికి చెందిన విద్యార్థులు హేమంత్, మొండి మోక్షిత్ అస్వస్తతకు గురయ్యారు.
జూలై 26: ఇదే గురుకులంలో మెట్పల్లి మండ లం అరపేటకు చెందిన 8వ తరగతి విద్యార్థి అద్వైత్ అస్వస్థతకు గురై మృతిచెందాడు.
గురుకులాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఫుడ్‌పాయిజన్ ఘటనలకు నాసిరకం సరుకులే కారణమని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచి ఇవ్వకవడంతో కాంట్రాక్టర్లు నాణ్యతలేని సరుకులనే సరఫరా చేస్తున్నారని, ఎక్కడా మెనూ పాటించడం లేదని వారు చెబుతున్నారు. ఫలితంగానే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ జరుగుతున్నాయని వాపోతున్నారు. ఇదిలా ఉంటే గురుకుల విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న పాఠశాలల వేళల కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలతో పాటు తల్లిదండ్రులు సైతం వాపోతున్నారు. సాధారణంగా గురుకుల విద్యార్థుల దినచర్య ఉదయం 5గంటలకు మొదలవుతుంది.
7గంటల వరకు బ్రేక్ ఫాస్ట్, 8.15 గంటల నుంచి మధ్యాహ్నం 1:25 వరకు 7 పీరియడ్లను ఏకధాటిగా నిర్వహిస్తే స్టూడెంట్స్ ఎలా భరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్లాస్‌లు ప్రారంభమైనప్పటి నుంచి సూల్ ముగిసే వరకూ యూరినల్ టైమ్స్‌కి గంటన్నర, మూడున్నర గంటల గ్యాప్‌లో లంచ్, ఆ తర్వాత గంటన్నర గ్యాప్‌లో తిరిగి షార్ట్ బ్రేక్ లాంటివి ఉంటాయని ఉదహరిస్తున్నారు. కానీ గురుకుల విద్యార్థులను రోబోల్లా ట్రీట్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం గేమ్స్ తర్వాత విద్యార్థులకు పర్సనల్ టైమ్ కేవలం 15 నిమిషాలే ఉంటున్నదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోచ్చని చెబుతున్నారు. మార్చిన వేళలు విద్యార్థుల మానసికస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఫుడ్‌పాయిజన్, అనుమానాస్పద, బలవన్మరణాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఉన్నతాధికారులు హడావుడి చేయటం, ఎంక్వయిరీ కమిటీ వేయటం పరిపాటిగా మారిందని, గురుకులాలను ఎత్తేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆయా ఘటనల్లో గురుకుల వార్డెన్‌ను లేదంటే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం రివాజుగా మా రిందని విద్యార్థినేతలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
బీసీ సంక్షేమ గురుకులాలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నా ఇప్పటి వరకు వారు సమీక్షించింది, అధికారులకు సూచనలిచ్చిందీ లేకపోవడం ప్రభుత్వ పర్యవేక్షణకు అద్దంపడుతున్నది. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు సీఎం వద్దే ఉన్నా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం. ఇకనైనా గురుకులాల్లో జరిగే ఘటనలకు ప్రభుత్వం పరిష్కారమార్గాలను వెతకాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
గురుకుల సిబ్బంది పర్యవేక్షణలోపం కూడా వరుస ఘటనలకు కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పనిఒత్తిడి కారణంగానే పర్యవేక్షణపై దృష్టి పెట్టడం లేదని గురుకుల ఉపాధ్యాయులు సైతం వాపోతున్నారు. మార్చిన పనివేళలతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారని, అందుకే విద్యార్థులపై దృష్టిపెట్టడం లేదని పలువురు ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. గురుకుల ఉపాధ్యాయుడికి పాఠాలు చెప్పడం ఒక్కటే కాకుండా డైనింగ్, వాటర్ డ్యూటీ, శానిటరీ డ్యూటీ, కిచెన్ ఇన్స్పెక్షన్, ఏటీపీ రొటేషన్, స్టడీ అవర్స్, కూరగాయలు కొలతలతో ఇవ్వడం, రాయడంలాంటి అనేక బోధనేతర విధులతోనే నిత్యం సతమతమవుతున్నామని, వృత్తికి, తాము చేసే పనికి సంబంధమే లేదని చెబుతున్నారు. తాము కూడా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని టీచర్లు చెప్తున్నారు.
గురుకుల పాఠశాలల్లో అమలు చేస్తున్న పనివేళలను పూర్తిగా మార్చాలి. ప్రస్తుతం ఉన్న పనివేళల వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దాని ప్రభావం విద్యార్థులపైనా పడుతున్నది. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక వాతావరణం అన్నదే లేకుండా పోతున్నది. ఆహ్లాదకర వాతావరం నెలకొల్పాలంటే ఉపాధ్యాయుల్లో ఒత్తిడిని తగ్గించాలి. ప్రభుత్వం ఆ దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలి.
– బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు