శంకర్పల్లి, జనవరి 8 : రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్స్టేషన్ పరిధిలోని మిర్జాగూడ గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండల పరిధిలోని దొంతాన్పల్లి ఐబీఎస్ విశ్వవిద్యాలయంలో సూర్యతేజ (20), సుమిత్ (20), శ్రీనిఖిల్ (20), రోహిత్ (18), నక్షత్ర ఎంజీఐటీ విద్యనభ్యసిస్తున్నారు. సుమిత్ పుట్టినరోజు సందర్భంగా నార్సింగిలోని ఓ హాటల్లో వీరంతా కలిసి వేడుకలు చేసుకుకున్నారు. తిరుగు ప్రయాణంలో మోకిలలో సాయి ఆకాశ్ అనే స్నేహితుడిని డ్రాప్చేసి వెళ్తుండగా మిర్జాగూడ గేటు వద్ద కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నక్షత్ర నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. సూర్యతేజ స్వస్థలం మంచిర్యాల కాగా, హైదరాబా ద్ తార్నాకలో స్థిరపడ్డారు. సుమిత్ స్వస్థలం సంగారెడ్డిలోని రాజంపేట్, శ్రీనిఖిల్ స్వ స్థలం విజయవాడలోని నిడమనూరు కాగా రోహిత్ స్వస్థలం కోకాపేట్.