కూసుమంచి, ఆగస్టు 1 : ‘ఉడికీ ఉడకని అన్నం.. సగం పచ్చిగా ఉన్న గుడ్లు మాకొద్దు’ అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం వదిలేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. గతంలో ఈ పాఠశాలలో వంట చేసిన నిర్వాహకులు మానేయడంతో ఏడాది కాలంగా కూసుమంచి హైస్కూల్లో వంట చేస్తున్న వారే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వంట చేసి పెడుతున్నారు.
గతంలో వంట చేసిన నిర్వాహకులు తామే విద్యార్థులకు వండి పెడతామని ముందుకు వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం వారికి మధ్యాహ్న భోజన బాధ్యతలు అప్పగించారు. వంట చేసిన నిర్వాహకులు విద్యార్థులకు వడ్డించగా.. అన్నం ఉడక లేదని, గుడ్డు కూడా పచ్చిగా ఉన్నదని చెబుతూ ప్లేట్లలో పెట్టిన భోజనాన్ని తినకుండా వదిలేసి నిరసన తెలిపారు. దీన్ని గమనించిన హెచ్ఎం భాస్కర్ ఈ విషయాన్ని ఎస్ఎంసీ చైర్మన్ అన్నపూర్ణ, ఎంఈవో రాయల వీరస్వామి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
ధన్వాడ, ఆగస్టు 1 : నారాయణపేట జిల్లా ధన్వాడ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పీడీ సస్పెండ్ అయ్యారు. పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని ఇటీవల విద్యార్థినులు రాస్తారోకో చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మాడల్ స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ స్పందించి పాఠశాల ప్రిన్సిపాల్ ఉమై ఆశ్ర, పీడీ తులసీదాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా కృష్ణమూర్తిని నియమించారు.