మరికల్, నవంబర్ 29 : నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం ప్రాథమిక పాఠశాలలో నెల రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న వంట ఏజెన్సీకి బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం నిలిపివేశారు. దీంతో నెల రోజులుగా విద్యార్థులు ఇండ్ల నుంచే భోజనాలు తెచ్చుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలను సందర్శించిన విలేకరుల బృందానికి విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్సుల్లో భోజనం చేయడం కనిపించి ఈ విషయంపై హెచ్ఎం జ్యోతిని వివరణ కోరారు. మధ్యాహ్న భోజనం చేయడానికి ఏజెన్సీలు ముందుకు రావడం లేదని, విద్యార్థులు పస్తులుండరాదనే ఉద్దేశంతో ఇంటినుంచే బాక్సులు తెచుకోమని చెప్పామని వివరించారు. మధ్యాహ్న భోజనం చేసేందుకు వంట ఏజెన్సీలు ముందురాకపోతే అక్షయపాత్రకు మధ్యాహ్న భోజనాన్ని అప్పగించాలని గ్రామస్తులు సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 29: ఒకవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందక ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకుంటుండగా, మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ నాణ్యంగా లేదంటూ రోడ్డెక్కారు. శుక్రవారం ఉదయం టిఫిన్ సరిగా లేదని వంట పాత్రలు తీసుకొచ్చి ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. నాసిరకమైన భోజనం, ఇతర సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్పందించిన చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ ధర్నా వద్దకు వచ్చి విద్యార్థులతో చర్చించారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.