మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 25 : పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవి సెలవులు ముగిశాక పీయూలో ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమైనా అధికారులు ఇప్పటి వరకు వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ-గద్వాల, నారాయణపేట, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా పీయూలో చదువుతున్నారు. వసతి గృహాల్లో సరుకులు నిండుకోవడం.. డిపాజిట్ చెల్లిస్తే సరైనా భోజనం అంటూ అధికారులు అంటుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సీనియర్ల అద్దె గదులు, బంధువుల ఇండ్లలో, మరికొందరు పీయూ వసతి గృహాల్లోనే తలదాచుకుంటూ ఒక పూట తిని, మరో పూట పస్తులుంటూ నానా పాట్లు పడుతున్నారు.
పీయూలో విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.2,100 చొప్పున భోజన బిల్లు అందిస్తున్నది. మేనేజ్మెంట్ హాస్టల్ పేరిట అధికారులు వసతి భోజన నిర్వహణ బాధ్యత విద్యార్థులకే అప్పగించారు. ఒక్కో విద్యార్థికి సరాసరి నెలకు రూ.2500-3వేలకు పైబడి ఖర్చు వస్తున్నది. ప్రభుత్వం అందించే రూ.2100కు అదనంగా రూ.400 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన అధికారులు మెస్ బిల్లుల పేరిట విద్యార్థుల నుంచి ఏటా అడ్వాన్స్‌గా రూ.5వేల నుంచి రూ.10వేల వరకు కట్టించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో అడ్వాన్స్ చెల్లించే పరిస్థితి లేదని, తాము త్వరలో చెల్లిస్తామని విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నా.. ఏ మాత్రం కనికరించడంలేదని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. రూ.25లక్షల నుంచి రూ.28లక్షలు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 70-80 శాతం మంది విద్యార్థులు డిపాజిట్ చెల్లించారని, 20 శాతం మంది మాత్రమే పెండింగ్ పెట్టారని, అవి కడితే రూ.లక్ష లేదా 2లక్షలు మాత్రమే అవుతాయని తెలిపారు. దానికి పేద విద్యార్థులపై ఇలా ఒత్తిడి తీసుకురావడం సరైనది కాదని మండిపడుతున్నారు. అధికారుల తీరుతో పేద విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
అసమర్థ పాలనలో పాలమూరు యూనివర్సిటీ వసతిగృహ విద్యార్థులందరం అర్ధాకలితో అలమటిస్తున్నామని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ ప్రధాన ముఖద్వారం ఎదుట విద్యార్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పీయూ నుంచి మహబూబ్‌నగర్ కలెక్టరేట్ వరకు కాలి నడకన వెళ్లి కలెక్టర్ విజయేందిరబోయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పాలమూరు యూనివర్సిటీ వసతిగృహాల నిర్వహణ రోజురోజుకి దిగజారి పోతుందని మండిపడ్డారు. పదిరోజులుగా ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారు, కారం మెతుకులతో కాలం వెళ్లదీస్తూ కడుపునొప్పితో కష్టాల పాలవుతున్నామని వాపోయారు. భోజనం బాగాలేదంటూ 3గంటల పాటు పీయూ ఎదుట బైఠాయించినా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.