హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ బకాయిలు వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీల యాజమాన్యాలు తేల్చి చెప్తుండటంతో ఏమి చెయ్యాలో అర్థంగాక దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండటంతో మరో కోర్సులో చేరలేకపోతున్నారు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా వారి వద్ద సర్టిఫికెట్లు లేక నానా తంటాలు పడుతున్నారు.
దాదాపు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు, విద్యార్థులు ఎన్నోసార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోతున్నది. ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే నిరుపేద ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏటా దాదాపు 14 లక్షల మందికిపైగా విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వీరందరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది.
హామీలన్నీ గాలికి..
బకాయి నిధుల కోసం యాజమాన్యాలన్నీ కలిసి గతంలో కాలేజీల బంద్ చేపట్టాయి. దీంతో 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను రెగ్యులర్‌గా విడుదల చేస్తామని, బకాయిలను మాత్రం వన్‌టైం సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని గత ఏడాది జేఎన్టీయూ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. దీంతో నాడు యాజమాన్యాలు దిగివచ్చి కాలేజీలను నిర్వహించాయి. ఆ హామీని సర్కార్ నిలబెట్టుకోలేదు. ఇకనైనా సర్కార్ తక్షణం స్పందించి బకాయిలు చెల్లించాలని, లేదంటే ఉద్యమిస్తామని విద్యార్థి, కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.