శామీర్పేట, జూలై 14: గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి శివారు ప్రాంతంలోని మహాత్మజ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల(కూకట్పల్లి క్యాంపస్) నుంచి బస్టాప్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజీవ్ రహదారిపై బైఠాయించారు. పాఠశాల, కళాశాలల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు విద్యార్థులు వాపోయారు. హాస్టల్లో స్నానం చేయడానికి సరిపడా బాత్రూమ్లు లేవని.. 500 మంది విద్యార్థులకు కేవలం 2 బాత్రూమ్లు మాత్రమే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
నాణ్యమైన ఆహారం ఇవ్వడంలేదని వెల్లడించారు. నీటి సమస్య, అపరిశుభ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే రోడ్డెక్కామని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై పాఠశాల నిర్వాహకులను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ జహంగీర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు వెంటనే వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, పోలీసులు, గ్రామపెద్దలు విద్యార్థులతో మాట్లాడగా.. గ్రామ పెద్దల హామీతో వారు ఆందోళన విరమించి స్కూల్ బాటపట్టారు.
గురుకులంలో ఇంటర్ విద్యార్థి మృతి! ; హనుమకొండ జిల్లాలో ఘటన
వేలేరు(ధర్మసాగర్)/శాయంపేట, జూలై 14 : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గురుకులం లో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘట న విషాదాన్ని నింపింది. ఎస్సై నర్సింహారావు వివరాల ప్రకారం.. శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామానికి చెందిన బత్తిని కుమారస్వామి-విశాల దంపతుల కుమారుడు మణితేజ (17) కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకుల కళాశాలలో ఇం టర్ ద్వితీయ సంవత్సరం చదవుతున్నాడు. సోమవారం కళాశాల ప్రాంగణంలో రన్నింగ్ చేస్తున్న క్రమంలో కిందపడిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మణితేజకు దెబ్బ తగిలిందని, ఎంజీఎంకు తీసుకుపోతున్నామని సమాచారం ఇచ్చారని, ఇక్కడికి వచ్చిచూస్తే మృతిచెంది ఉన్నాడని బోరున విలపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ధర్మసాగర్ ఎస్సై పేర్కొన్నారు.