ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే ఆత్మహత్యకు పాల్పడిన నవీన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహాయంతో ఇవాళ ఇంటికి తీసుకొచ్చారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునగలవీడు గ్రామానికి చెందిన నల్లాని భీంరావు కుమారుడు నల్లాని నవీన్ కుమార్ (29) ఉన్నత చదువుల కోసం కొంతకాలం కిందట లండన్ వెళ్లాడు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్.. ఈ నెల 3వ తేదీన లండన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విదేశం నుండి స్వదేశానికి మృతదేహాన్ని తీసుకురావడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంలో ఈ విషయాన్ని వుసిరికపల్లి వాసుదేవరావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి తెలియజేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్, లండన్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్, అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులతో సంప్రదించి, అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయంతో మృతదేహాన్ని భారత్కు తరలించే ఏర్పాట్లు చేయించారు. దీంతో ఇవాళ నవీన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.
ఈ సందర్భంగా మునగలవీడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నల్లాని శోభ పాపారావు, మాజీ సర్పంచ్ నల్లాని నవీన్ తదితరులు కూడా సహకారం అందించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కేటీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.