Telangana | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సర్కారు స్కూళ్లల్లో విద్యార్థుల నమోదు(ఎన్రోల్మెంట్) పడిపోతున్నది. ఏటా మూడు లక్షల మంది విద్యార్థులు సర్కారు బడుల నుంచి దూరమవుతున్నారు. మూడేండ్లల్లో ఆరు లక్షల మంది సర్కారు చదువులను వదులుకుని, ప్రైవేట్‌లో చేరిపోయారు. ఇక జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్యలో దేశంలో తెలంగాణ అథమ స్థితిలో ఉంది. జాతీయంగా 12వేలకు పైగా జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లుండగా.. పశ్చిమ బెంగాల్ 3,254, రాజస్థాన్ 2,167, తెలంగాణ 2,097 స్కూళ్లతో వరుసగా మొదటి, రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. 2023-24 ఏడాదికి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్) ప్లస్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో సింగిల్ టీచర్‌తో నడుస్తున్నవి 5,985 స్కూళ్లన్నాయి.
8వ తరగతి దాటి పైచదువులకు వెళ్లడానికి విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. 8వ తరగతి పూర్తిచేసిన వారిలో 11.4శాతం విద్యార్థులు డ్రాపౌట్లుగా మిగులుతున్నారు. వీరిలో బాలురు 13.3శాతముండగా, బాలికలు 9.5శాతం డ్రాపౌట్లు అయ్యారు. 42వేల స్కూళ్లుండగా, 11.8శాతం స్కూళ్లు పది మందిలోపు విద్యార్థులతో నడుస్తున్నాయి. 500కు పైగా విద్యార్థులున్న స్కూళ్ల శాతం కేవలం 8.7శాతం మాత్రమే. ఎన్రోల్మెంట్ పడిపోవడంతో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి కూడా పడిపోయింది. విద్యార్థులు తగ్గగా, టీచర్లు ఎక్కువున్నారు. ప్రాథమిక తరగతుల్లో 19, ప్రాథమికోన్నత తరగతుల్లో 12, సెకండరీ స్కూళ్లల్లో 9, హయ్యర్ సెకండరీలో 25 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉన్నారు.