జగదేవపూర్,ఆగస్టు 29 : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్‌లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. యశ్వంత్‌కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూర్పల్లెలో వైద్యం చేయించారు. పరిస్థితి విషమించి గురువారం అర్ధరాత్రి యశ్వంత్ చనిపోయాడు. కిష్టయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు యశ్వంత్ కుకునూర్పల్లె పాఠశాలలో చదువుతున్నాడు. గతంలో తిమ్మాపూర్ మధిర గ్రామంగా అనంతసాగర్ ఉండేది.
బీఆర్ఎస్ హయాంలో అనంతసాగర్ కొత్త పంచాయతీగా ఏర్పడింది. తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాలు పక్క పక్కనే ఉంటాయి. ఈ రెండు గ్రామాల్లో వారం వ్యవధిలో కొంతం మహేశ్, శ్రావణ్‌కుమార్ డెంగీతో మృతిచెందగా, గురువారం రాత్రి యశ్వంత్ మృతితో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
ఈ రెండు గ్రామాల్లో రెండు వందల మందిపైనే విషజ్వరాలతో బాధపడుతున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. జిల్లా అధికారులు ఆయా గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ విష జ్వరాలు అదుపులోకి రావడంలేదు.