ఆదిలాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 83 మంది గురుకులాల విద్యార్థులు మరణించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని లాలిత్య(13) మరణించింది. బజార్హత్నూర్ మండలం మొర్కండికి చెందిన లాలిత్య ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఉదయం నోటి నుంచి నురగలుకారి అనుమానాస్పద స్థితిలో మరణించింది. విద్యార్థిని తల్లిదండ్రులు రాజేశ్వర్, లక్ష్మీబాయిలు కూలీ పని చేసుకుంటూ లాలిత్యను ఇచ్చోడ ఆశ్రమ పాఠశాలలో చదవిస్తున్నారు. మృతదేహాన్ని చూసి అనంతరం తండ్రి రాజేశ్వర్‌ను పోలీసులు లాక్కొని పోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కోల్పోయిన తండ్రి ఆవేదనను అర్థం చేసుకోకపోవడం బాధాకరమని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించాయి.
సోమవారం ఉదయం 8 గంటలకు నా బిడ్డ సచ్చిపోయిందని బడి నుంచి సార్లు ఫోన్ చేసిన్రు. నేను వారితో మా ఊరి పటేల్, గ్రామస్తులతో కలిసి వస్తున్నాం. అప్పటి వరకు నా బిడ్డను అక్కడే ఉంచండని చెప్పా. నేను బడికి వెళ్లేసరికి నా బిడ్డ మృతదేహాన్ని బోథ్ దవాఖానకు తీసుకెళ్లారు. అసలు నా బిడ్డకు ఏమైంది? ఎలా చనిపోయిందని అడిగితే ఎవరూ కారణం సెప్పలేదు. నా బిడ్డ మృతికి కారణాలు తెలిపి, న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లాలిత్య చనిపోయిందని, న్యాయం చేసేంతవరకు పోరాడుతామని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పేర్కొన్నారు. బోథ్ దవాఖానలో విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి, విలేకరులతో మాట్లాడారు. విద్యార్థి కుటుంబసభ్యులు అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో విద్యార్థుల మరణమృదంగాన్ని ఆపడం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు చేతగావడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా పట్టించుకోకుండా కనీస మానవత్వం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థ సరారు తీరుతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కళ్లముందు విగతజీవిగా పడిఉన్న బిడ్డ మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, ఆ బాలిక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సరారు తీరును విద్యార్థుల తల్లిదండ్రులే గాకుండా యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందన్నారు. విద్యార్థుల మరణాలు సర్కార్ హత్యలేనని ఆరోపించారు.