హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : మూసీ విషయంలో రేవంత్ సర్కార్ తీరును అడుగడుగునా ఎండగడుతున్న బీఆర్ఎస్కు తోడుగా విద్యార్థిలోకం కదిలివచ్చింది. మూసీ బాధితులకు తాము కూడా అండగా నిలుస్తామని నినదించింది. లక్ష కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ అంటూ రేవంత్ సర్కార్ నాటకాలాడుతున్నదని పేర్కొంది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఏ విధంగానైతే మిలియన్ మార్చ్ నిర్వహించామో ఇప్పుడు మూసీ కోసం మరో మిలియన్ మార్చ్ నిర్వహించాలని వక్తలు పిలుపునిచ్చారు. విద్యార్థులు తలుచుకుంటే కాంగ్రెస్ సర్కార్ ఆగడాలకు అడ్డకట్ట పడుతుందని సూచించారు. ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ లక్షల కోట్లతో మూసీ నదికి పునరుజ్జీవం పోస్తామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఎందుకు డీపీఆర్ తయారు చేయలేదో ముందుగా స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా పనులు చేపట్టడం సరికాదని, ప్రాజెక్టు డెవలప్మెంట్ పేరిట జరుగుతున్న అడ్డగోలు తరలింపు ముమ్మాటికి ప్రజావ్యతిరేక విధానమేనని చెప్పారు. నోటీసులు, భూసేకరణ నోటిఫికేషన్‌తో మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండే వేలాది కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయని తెలిపారు. నది పక్కనే ఉండే పేద, మధ్యతరగతి ఇండ్లను కూల్చి, నది గర్భంలో భారీ గాంధీ విగ్రహం నిర్మించాలని ఎవరూ అడగలేదని పేర్కొన్నారు. గాంధీ మనువడు తుషార్‌గాంధీ కూడా పేదల ఇండ్లను కూల్చి కట్టాలనుకున్న గాంధీ భారీ విగ్రహాన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. మేధాపాట్కర్ లాంటి మేధావులు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు కూడా ఆమోదయోగ్యం కాదనీ బాహాటంగానే చెప్తున్నారని వివరించారు.
మూసీ పునరుజ్జీవం పేరిట హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కార్‌ను నిలువరించేలా మిలియన్ మార్చ్ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నదని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్పారు. ‘లక్ష కోట్ల ప్రజాధనం కోసమే ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లుగా అనిపిస్తున్నది. ఆరు గ్యారెంటీలతో గెలిచి, తర్వాత మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఈ సారి మూసీ పేరిట నిండా ముంచేలా వ్యవహరిస్తున్నారు. ఒక్క ఇంటిని కూల్చకుండా, ఒక్క ఇటుక కదిలించకుండానే నాగోల్‌లో మూసీని సుందరీకరణ చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. కానీ మూసీ పునర్జీవం పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసాన్ని నిలువరించాల్సిన అవసరం ఉన్నది. ఈ పని విద్యార్థులే చేయాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో రాష్ట్ర సాధన జరిగితే, దానికి కృతజ్ఞతగా భారీ విగ్రహాన్ని చేపట్టిన కేసీఆర్ హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. మహానగరాన్ని నిర్మించాలనే ఆశయంతో బీఆర్ఎస్ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించింది. అందుకు విరుద్ధంగా కూల్చివేతలు, వేల కోట్ల భూములను లాక్కునేలా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నది. నాడు ఆధునాతన సాంకేతికతతో నిర్మించిన కాళేశ్వరంతో లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించారు. నేడు లక్ష కోట్లతో చేపట్టే మూసీ పునర్జీవంతో ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందిస్తారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలి’ అని నిలదీశారు.
‘పోటీ ప్రపంచంలో ప్రతి నగరానికీ అభివృద్ధి అనివార్యం. దీనికి ఎవరూ అడ్డుపడే పరిస్థితి లేదు. కానీ శాస్త్రీయ విధానం లేకుండా జరుగుతున్న విధ్వంసాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిందే. నిజంగా మూసీ పునర్జీవానికి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటే అనంతగిరి నుంచి మొదలైన మూసీ వెంబడి ఆక్రమణలు, యథేచ్ఛగా మూసీలో కలుస్తున్న మురుగునీటిని అడ్డుకోవాలి. ఎలాంటి సోషియో ఎకనామిక్ అసెస్మెంట్ జరుగకుండా, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టును అమలు చేయాలని చూస్తే రహస్య అజెండా ఉందనే అనుమానమే కలుగుతుంది. ప్రత్యామ్నాయ, ప్రజా ప్రయోజనకరమైన విధానాలతో మూసీకి పూర్వవైభవం తీసుకురావాలి..గానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో, అభివృద్ధి పేరిట వేల కోట్లు దోచుకోవడం కోసమో ప్రజాధనంతో చెలగాటలాడొ ద్దు’ అని ఓయూ మాజీ వీసీ రవీందర్ సూచించారు.
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ తిరుగుతుంటే.. అదే రాజ్యాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖూనీ చేసి, ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా, పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా, రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా, మూసీ ప్రాజెక్టును చేపట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోపీడీ చేసే కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. మూసీ బాధితులకు విద్యార్థి సంఘాలు తోడుగా ఉండటం అభినందనీయమని తెలిపారు. మూసీ సుందరీకరణ పేరిట వేల మందిని రోడ్డున పడేసే కాంగ్రెస్ సర్కార్‌ను అడ్డుకోవడానికి ఉద్యమిస్తామని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇంటిని కూల్చకుండా మూసీ సుందరీకరణ పనులు జరిగాయని చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, పీడీఎస్(జీ), జీవీఎస్, డీవైఎస్ఎఫ్, ఏఎంఎస్ఏ, ఓయూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ దోపిడీని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు చర్చ వేదికను నిర్వహించడాన్ని విద్యావేత్తలు అభినందించారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి మెంటార్‌గా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు షాడో సీఎంగా పనిచేస్తున్నారు. ఆయన చూపిన బాటలోనే మూసీకి గీసిన భారీ స్కెచ్‌ను రేవంత్ అమలు చేస్తున్నారు. నదుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబుకు ఎన్జీటీ రెండుసార్లు వందల కోట్ల పెనాల్టీ వేసింది. నది విషయంలో చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలను ఇక్కడ కూడా అమలు చేయాలని రేవంత్ చూస్తున్నారు. ప్రజా ఉద్యమాలు లేకపోతే ఎన్జీటీ కూడా పట్టించుకోదు. నది పరీవాహక ప్రాంతాల విషయంలో ఎన్జీటీ కొత్త నిబంధనల ప్రకారం 200 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలకు తావు లేదు. ఆ లెక్కన ఇప్పుడు కట్టనున్న గాంధీ సరోవర్ కూడా అక్రమ నిర్మాణమే అవుతుంది. ఎస్టీపీలకు నిధుల్లేవు గానీ, వేల కోట్లతో మూసీ నదీ గర్భంలో గాంధీ విగ్రహం ఎలా కడుతారు. ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను బఫర్‌జోన్ అంటున్నారు. మరీ మూసీ నదీగర్భంలో ఉన్న ఇమ్లీబన్ బస్టాండ్‌ను కూలగొడతారా? మెట్రో స్టేషన్‌ను నేలమట్టం చేస్తారా? జీరో వాల్యూ అంటున్న సీఎం మాటలకే విలువ లేకుండా పోతుంది. అమృత్ స్కీమ్‌లో 10శాతం కేంద్రానికి నిధులు కేటాయిస్తే… 90శాతం నిధులతో మూసీ వెంబడి మరో 60 ఎస్టీపీలను నిర్మించుకోవచ్చు. కాంగ్రెస్ తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని రేవంత్ కాలరాసి, స్పష్టత లేని టీడీఆర్‌తో చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. సబర్మతి, థేమ్స్ నది ప్రక్షాళన దశాబ్దాల కాలం పాటు సాగింది. వేల కోట్లతో అభివృద్ధి చేసినా… ఇప్పటికీ సబర్మతి, థేమ్స్ నదిలో మురుగు వాసన పోలేదు. అదే విధంగా మూసీలో జరుగబోయేది అదే.