Telangana | సంగారెడ్డి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకున్నది.
తోటి విద్యార్థినుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన టీ స్వాతి (14) సంగారెడ్డి మండలం కొత్లాపూర్బీసీ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. శనివారం స్వయంపాలన దినోత్సవం ఉండటంతో శుక్రవారం తోటి విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. రాత్రి భోజనాల అనంతరం నిద్రపోయింది. శనివారం ఉదయం 5 గంటలకు లేచిన స్వాతి రెండో అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తోటి విద్యార్థినులు విషయాన్ని పీడీ సుజాత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె, సిబ్బంది వచ్చి గది తలుపు బద్దలుకొట్టారు. అప్పటికే స్వాతి మృతి చెందడంతో ప్రిన్సిపాల్ స్రవంతికి తెలిపారు. స్రవంతి సంగారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్వాతి మృతదేహాన్ని సంగారెడ్డి జనరల్ దవాఖానకు తరలించారు.
స్వాతి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, సమగ్ర విచారణ చేపట్టాలని తల్లి దివ్యవాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల సిబ్బంది తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు గురుకులం ఎదుట ఆందోళనకు దిగారు. డీఎస్పీ సత్తయ్య నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టం గది వద్ద కూడా కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతుగా పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి తిరుపతి ప్రభుత్వ దవాఖాన వద్దకు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మానసిక ఒత్తిడితోనే స్వాతి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని డీఎస్పీ సత్తయ్య తెలిపారు. స్వాతి పుస్తకాల్లో తన అక్క జానుకు రాసిన లేఖ దొరికిందన్నారు. తన అక్క జాను జన్మదినం వరకు తాను జీవించి ఉంటానో లేదోనని స్వాతి లేఖలో రాసిందని పేర్కొన్నారు. స్వాతి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ సత్తయ్య తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేయిస్తారా? అని మండిపడ్డారు. ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరుపడంతోపాటు ఆమె కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు పరిషరించడం లేదని ప్రశ్నించారు.