Govt Junior Colleges | హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : సర్కారు జూనియర్ కాలేజీల్లోని విద్యార్థుల్లో అత్యధికులు తరగతులకు డుమ్మా కొడుతున్నారు. చదువుకుని బాగుపడాలని బుద్ధిమాటలు చెప్పాల్సిన తల్లిదండ్రులే విద్యార్థులను పనులకు పురమాయిస్తున్నారు. వారు సైతం పుస్తకాలకు నో చెప్పి.. పనులకు సై అంటున్నారు. ఫలితంగా హాజరుశాతం 40-50లోపే ఉంటున్నది. ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి 24 వరకు జరగనున్నాయి.
పరీక్షలకు మరో మూడు నెలలు మాత్రమే ఉంది. ప్రిపేరవ్వాల్సిన సమయంలో పనులకెళ్లడంతో సర్కారు కాలేజీల్లో ఫలితాలపై ప్రభా వం చూపే అవకాశముంది. ఇప్పటికే ఇంటర్లో ఉత్తీర్ణతాశాతం అంతంతమాత్రంగానే ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు, గట్టు ప్రాంతాల్లోని విద్యార్థులు కాలేజీలకు డుమ్మా కొట్టి పత్తి ఏరడానికి వెళుతున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వారు ఇప్పపువ్వు, బీడీ ఆకు సేకరణ పనులకు వెళుతున్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. పరీక్షలు సమీపిస్తుండటంతో అ ధ్యాపకులు, ప్రిన్సిపాళ్లల్లో టెన్షన్ నెలకొన్నది.