హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్టుపై జాప్యం ఎందుకు.. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా ఎందుకు అరెస్టు చేయరు? ఇప్పటికైనా వెంటనే అరెస్టు చేయాలి’ అని డీజీపీ సీవీ ఆనంద్‌ను విద్యార్థి, మహిళా సంఘాలు కోరాయి. నిందితుడు బండి భగీరథ్ బాలికను లైంగికంగా వేధించాడని బాలిక కుటుంబం ఈ నెల 8న ఫిర్యాదు చేసిందని, భగీరథ్‌కు నోటీసులిచ్చినా విచారణకు రాకుండా, పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోకుండా పరారీలో ఉన్నాడని ఆయా సంఘాల ప్రతినిధులు చెప్పారు. ఇన్నిరోజులు గడుస్తున్నా బండి భగీరథ్‌ను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు డీజీపీకి వివరించారు. ముఖ్యంగా ఆ బాధిత బాలిక ఫొటోలను బండి సంజయ్, బండి భగీరథ్ వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారని డీజీపీకి తెలిపారు.
మైనర్ అయిన బాధితురాలి ఫొటోలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భగీరథ్‌ను పట్టుకోవడంలో జరుగుతున్న ఆలస్యంపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని పేర్కొన్నారు. సామాన్యులకు ఒక న్యాయం, మంత్రి కుమారుడికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసు జారీ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు మహేశ్, రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి సుమంత్, పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య, రాష్ట్ర కార్యదర్శి అనూరాధ, ఎన్ఎఫ్డబ్ల్యూ నాయకురాలు ఫాహీమా, ఏఐఎస్ఎఫ్ నాయకులు గ్యార నరేశ్, రెహమాన్ హరీశ్ తదతరులు పాల్గొన్నారు.