హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సంక్రాంతి పండుగవేళ పోలీసులు ముగ్గురు జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. తెలంగాణలో ఈ కాంగ్రెస్ పాలన అనుక్షణం ఎమర్జెన్సీని గుర్తుచేస్తోందని విమర్శించారు. తెలంగాణ డీజీపీ జర్నలిస్టులను నేరస్తులలా ట్రీట్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
మీరు ముందుగా వారికి నోటీసులు జారీచేసి విచారణకు పిలువాల్సిందని కేటీఆర్ అన్నారు. రాత్రిపూట జర్నలిస్టుల ఇళ్లపై దాడిచేసి సబబు కాదని తప్పుపట్టారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. వారిపై ఏమీ నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు కాలేదని, అలాంటప్పుడు తెలంగాణ పోలీసులు జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఎందుకు అర్ధరాత్రి అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు.
జర్నలిస్టులను వెంటనే విడుదల చేసి వారి విషయంలో చట్టపరంగా నడుచుకోవాలని తాను డీజీపీని కోరుతున్నానని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి నీచ నాయకత్వానికి అనుగుణంగా మురికి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. అసలు ఈ విషయాన్ని లీక్ చేసింది ఎవరు..? మిస్టర్ 30 పర్సెంట్ సపోర్టు లేకుండా ప్రభుత్వ అనుకూల టీవీ ఛానెల్ ఈ అంశాన్ని ప్రసారం చేసిందని మీరు భావిస్తున్నారా..? అని ప్రశ్నించారు.