కోస్గి, అక్టోబర్ 4 : కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని మండిపడ్డారు.
వడ్ల బోనస్, రైతు భరోసా, యూరియా, విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాసి రేవంత్ పాలనపై విసుగు చెందారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలా పరుగులు పెడితే..రేవంత్ పాలనలో కుంటుబడిపోయిందని, సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.