న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వివాదాలకు అంతం లేకుండా పోయింది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శుక్రవారం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సదస్సు జరుగుతున్న భారత్ మండపం వద్ద చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఏఐ సదస్సుకు పలువురు దిగ్గజ టెక్ సీఈవోలు హాజరైన రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. క్యూఆర్ కోడెడ్ పాసులను ఉపయోగించి ఏఐ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించిన సుమారు 10 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హాల్ నంబర్ 5 లోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
వారు తాము ధరించిన టీ షర్టులపై మోదీ, ట్రంప్ బొమ్మలతోపాటు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎప్స్టీన్ ఫైల్స్, ప్రధాని రాజీ పడ్డారు వంటి నినాదాలు రాసి ఉన్నాయి. ఈ ఘటనతో కొద్ది నిమిషాలపాటు అక్కడ గందరగోళం ఏర్పడింది. ఉదంతంపై కొందరు ఆహ్వానితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరసనకారులను పోలీస్ స్టేషనుకు తరలించారు.
నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏఐ వేదిక వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కాగా, తమ కార్యకర్తల నిరసనను భారతీయ యువజన కాంగెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ గట్టిగా సమర్థించారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న ప్రతి భారతీయ యువజనుడి ఆవేదనకు ఇది ప్రతిబింబమని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ నాయకుల నిరసనను బీజేపీ ఖండించింది.