Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పెట్టుబడి సాయం రానేలేదు.. రుణమాఫీ పూర్తి కాక నేపాయె.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లు కొనే దిక్కులేదు.. వర్షాలతో పంటలు నష్టపోతుంటే ఓదా ర్చే తీరిక లేదు.. మొన్నటి దాకా సాగు నీళ్లు లేక పొలంలోనే పంటలు ఎండిపోగా.. ఇక పండిన ఆ కొ ద్ది పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రా లకు తరలిస్తే.. కాలంగాని వానలొచ్చి అది కూడా తడిసిపోయి పనికిరాకుండా పోతున్నది.. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం మాత్రం రైతు మహోత్సవం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. నిజామాబాద్లో సోమవారం నుంచి బుధవారం వరకు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో కాంగ్రెస్ సర్కారు, వ్యవసాయ శాఖ తీరుపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తమ సమస్యలు తీర్చకుండా ఉత్సవాలు నిర్వహిస్తే లాభమేంటని అన్నదాతలు మండిపడుతున్నారు. తమ సమస్యలను తీర్చే నిధులు లేవు, తీరిక లేదు గానీ ఉత్సవాలకు మాత్రం కోట్లకు కోట్ల నిధులు, తీరిక ఎక్కడి నుంచి దొరుకుతున్నదని వారు ప్రశ్నిస్తున్నారు.
సమస్యలు పక్కనపెట్టి.. ఉత్సవాలెందుకు
ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువుల కొరత నుంచి మొదలుకొని పండించిన పంట అమ్ముకునే వరకు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా విత్తనాలు, ఎరువులు లభించడం లేదు. దీంతో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా విత్తనాలు, ఎరువులు కోసం బారులుతీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన పంట అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్నది. నష్టపోయిన రైతులను పరామర్శించి భరోసా ఇచ్చే దిక్కేలేకుండా పోయింది. ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా ఒక్క ఎకరానికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఇక ముందే వరి కోతలు పూర్తయిన రైతులు ఆ ధాన్యం అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. రుణమాఫీ, రైతుభరోసా సంగతి తెలిసిందే. యాసంగి పంట కోతలు పూర్తికావడానికి వస్తున్నా.. ఈ సీజన్ రైతుభరోసా పంపిణీని కాంగ్రెస్ సర్కారు పూర్తి చేయలేదు. మొత్తం రూ. 9వేల కోట్లకు గాను రూ.5వేల కోట్లు మాత్రమే జమ చేసి.. రూ. 4వేల కోట్లు ఎగబెట్టింది. ఇవి ఎప్పుడు రైతులకు పంపిణీ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇక రుణమాఫీకి సంబంధించి మొత్తం రూ. 31వేల కోట్లకు రూ.20,616 కోట్లు మాఫీ చేసింది. ఈ విధంగా కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమాగమైతుంటే… ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉత్సవాల పేరిట రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.