హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషిచేయాలని, అకాడమిక్ ఎక్స్లెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీసీలకు సూచించారు. మూడు నెలలకొకసారి సమీక్ష నిర్వహించాలని, మూ డు నెలల తర్వాత వీసీలతో సమీక్షాసమావేశాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు వర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్చాన్స్లర్లు గవర్నర్, వర్సిటీల చాన్స్లర్ జిష్ణుదేవ్ వర్మను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్భవన్లో ఈ భేటీ జరగగా, పలు అంశాలపై చర్చించారు. వర్సిటీలు పరిశోధనలపై దృష్టిసారించాలని, వీసీలే వర్సిటీలకు లీడర్లు అని, వందేండ్ల చరిత్ర గల ఉస్మానియా సహా అన్ని వర్సిటీలను బలోపేతం చేయాలని వీసీలను గవర్నర్ ఆదేశించినట్టు సమాచారం. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.