భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : 24రోజులుగా సమ్మెలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మంత్రి పొంగులేటి పర్యటనకు నిరసనసెగ చూపించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై పాల్వంచకు వెళ్తుండగా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
మంత్రిని అడ్డుకొని వినతిపత్రం ఇవ్వాలని చూడడంతో పోలీసులు వారిని రోడ్డు మీదకు రాకుండా కట్టడి చేశారు. దీంతో సర్వశిక్ష ఉద్యోగులు జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయకత్వంలో రోడ్డుపక్కన నిల్చొని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తర్వాత మంత్రి పొంగులేటికి వినతిపత్రాన్ని అందజేశారు.