నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 14: తమ సమస్యలు పరిష్కరించి, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్తు రంగంలోని ఆర్టిజన్లు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకున్నది. సమ్మెను అడ్డుకునేందుకు జెన్కో అధికారులు ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడినప్పటికీ కార్మికులు వెనక్కి తగ్గలేదు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో కూర్చున్నారు. అంతకుముందు ప్లకార్డులతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిర, వైరా, సత్తుపల్లిలోని డివిజన్ కార్యాలయాలు, సబ్ స్టేషన్ల వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టిజన్లు మాట్లాడుతూ.. విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. మహబూబ్‌నగర్ విద్యుత్తు భవన్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు చేపట్టిన నిరవధిక సమ్మెకు మంగళవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టిజన్లతో పెట్టుకుంటే ప్రభుత్వం కరెంట్ షాక్‌తో కిందపడ్డట్లు కావాలని అన్నారు. ఆర్టిజన్ల ఆందోళనకు చివరి వరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యుత్తు ఉద్యోగుల సమ్మె శిబిరానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో దీక్షా శిబిరాలను సందర్శించి చాయ్ తాగినంత సమయంలో సమస్యలు పరిష్కరిస్తానంటూ మోసపూరిత మాటలతో ఓట్లు దండుకున్నాడని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ములుగు రోడ్డులోగల ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ఆర్టిజన్లు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మద్దతు తెలిపారు. కరెంటోళ్ల సమ్మె కాంగ్రెస్ సరార్కు షాక్ ఇవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంఘీభావం తెలిపారు.