హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న రాజకీయ హైడ్రామాపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ చుట్టూ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కట్టుకున్న విలాసవంతమైన ఇండ్లు, ఫామ్‌హౌజ్‌లను ఆధారాలతో బయటపెట్టడంతో అధికారపక్ష నేతలు ఉలిక్కిపడ్డారు. ‘నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మా భవనాలనూ కూలగొట్టండి’ అని గంభీర ప్రకటనలు చేసినవారు కూడా నాలుక కరుచుకున్నట్టు తెలిసింది. కొందరు మంత్రులు, ముఖ్యనేతలు శనివారం ప్రత్యేకంగా సమావేశమై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పిలిపించుకున్నట్టు సమాచారం.
చెరువులు, నాలాల ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాల వరకు మాత్రమే పరిమితం కావాలని, బఫర్ జోన్‌ను ముట్టుకోవద్దని అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది. బఫర్ జోన్ పరిధిలో అధికారపక్ష నేతల భవనాలు ఉన్నాయని, వాటిని కూల్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తాయని, అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెప్పారట. ‘మీ కూల్చివేతలతో మా ఇంటి కిందికే నీళ్లు వచ్చేలా ఉన్నాయి’ అని వాపోయారని సమాచారం. మా ఇంటి దగ్గరికి మీరు వచ్చినా.. మేమే ఇల్లు ఖాళీ చేసినా అక్రమ నిర్మాణం అని ఒప్పుకున్నట్టు అవుతుందని, పరువు గంగలో కలుస్తుందని చెప్పుకొచ్చారట. ఎఫ్టీఎల్ వరకే పరిమితం అయితే ఇబ్బంది ఉండదని సూచించినట్టు సమాచారం. మంత్రుల విన్నపంపై సీపీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిసింది.
ఎఫ్టీఎల్.. లెక్క ఎలా తెలిసింది?
ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ను తగ్గించిన విషయం బయటికి ఎలా పొక్కిందని మంత్రులు రుసరుసలాడినట్టు సమాచారం. ఎఫ్టీఎల్ 1970 అడుగులు అనే లెక్కతోనే ‘మా భవనాలు ఉన్నా కూల్చేస్తాం’ అని గంభీర ప్రకటనలు చేశారని చెప్తున్నారు. అసలు ఎఫ్టీఎల్ 1972 అడుగులు అని బయటికి రావడంతో పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టు అయ్యిందని సమాచారం. 1972 అడుగులు అనే విషయాన్ని ఎందుకు బయటపెట్టారని జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 1972 అడుగుల ప్రకారం కొలిస్తే.. ఒక్క ఇటుక కాదు, మొత్తం భవనాలే ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉన్నదని చర్చించుకుంటున్నారట. ఈ అంశాలపై వివరణ కోరేందుకు జలమండలి అధికారులను ప్రయత్నించగా.. అధికారులు సమాధానం ఇవ్వకుండా ‘ఇవన్నీ మీకెవరు ఇస్తున్నారు?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ 1792 అడుగుల గొడవ ఇప్పుడు ఎందుకు?, ఈ అంశంలో నోరు మెదపవద్దని మాకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి.. అంటూ సమాధానం ఇచ్చారు.
వాళ్లే ఒప్పుకుంటారా.. వీళ్లు కూలగొడతారా?
ప్రతిపక్ష నేతల ఆస్తులను లక్ష్యంగా చేసుకొని హైడ్రాకు రూపకల్పన చేస్తే, అధికారపక్ష నేతల బండారం బయటపడిందని చెప్పుకుంటున్నారు. హైడ్రా బుల్డోజర్లు వాళ్ల ఇండ్లదాకా వెళ్తాయా? లేదా? అని ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ‘వాళ్లే ఖాళీ చేస్తే.. చెరువులను ఆక్రమించామని ఒప్పుకున్నట్టు అవుతుంది. హైడ్రా అధికారులు వెళ్లి కూల్చితే అక్రమ నిర్మాణాలని అధికారికంగా ప్రకటించినట్టు అవుతుంది. ఏం జరిగినా వాళ్లు కూడా దొంగలే అనే ముద్ర తప్పదు’ అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ మిగతావారివి కూల్చి, అధికార పక్ష నేతలవి ముట్టుకోకపోతే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని అంటున్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రారంభించిన రాజకీయ డ్రామా భస్మాసుర హస్తంగా మారే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు.