MLC Kavitha | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీళ్లపై నీచ రాజకీయాలను మానుకోవాలని, ఇకనైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ‘నీళ్లు-నిజాలు’ అనే అంశంపై శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కవిత అధ్యక్షత వహించగా, విశ్రాంత ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. పలు తీర్మానాలు ఆమోదించి సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లపై రాజకీయాలను మానుకోవాలని అన్నారు. కేసీఆర్‌పై అకసుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే కాకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయాన్ని, గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బరాజ్ మేరునగధీరుడిలా నిలబడిందని వివరించారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేయాలని డిమాండ్‌చేశారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగించారని, అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించాలని హితవు చెప్పారు. ఆంధ్ర క్యాడర్లో పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ను ఇరిగేషన్ సలహదారుగా వెంటనే తొలగించాలని, కృష్ణ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్లందించారని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించామని, కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని వివరించారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకొని 15 లక్షల ఎకరాలకు సాగునీళ్లను అందించారని, కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నామని తెలిపారు. ఇన్ని చేసినా పదేండ్లలో ఏమీ జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పైరవీలు చేసుకున్నారు తప్ప ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదని కవిత నిప్పులు చెరిగారు. గట్టిగా జై తెలంగాణ అంటే.. వెంటనే ఫేక్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేవారని గుర్తుచేశారు. ‘వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి మన జలాలను తరలించారు. అదే ఒరవడిని జగన్, చంద్రబాబు కొనసాగించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయనుకుంటే… ఇప్పుడు వాటికి బీజేపీ తోడయ్యింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒకటవుతారని, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారని ఉదాహరించారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక నీరు కూడా ఇవ్వలేదని వెల్లడించారు. ఇకనైనా తెలంగాణ సోయితో ప్రభుత్వం పరిపాలనను కొనసాగించాలని హితవుపలికారు.
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ మొదలు పెట్టేవరకూ ప్రాణహిత, పెన్‌గంగా ప్రాజెక్టులకు అతీగతీ లేకుండా పోయిందని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే లాభంకన్నా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రాకే లాభం ఎకువని, కేసీఆర్ దానిని పకనబెట్టి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టారని గుర్తుచేశారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేశారని వివరించారు. పదేళ్ల కాలంలో తెలంగాణ సాగునీటి రంగాన్ని ప్రపంచంలోనే మేటిగా నిలపాలని సంకల్పించారని, కోటి ఎకరాల మాగాణం తన స్వప్నమని చెప్పి సాధించి చూపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఓర్వలేనితనంతో కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టుపై దుమ్మెత్తిపోస్తున్నదని మండిపడ్డారు. నీళ్లు, ప్రాజెక్టులపై చేస్తున్న దుష్ప్రాచారాన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలను నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కేసీఆర్‌తోనే తెలంగాణ రైతాంగానికి నదీ జలాల ఫలాలు దక్కాయని విశ్రాంత ఇంజినీర్, మాజీ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే కొనియాడారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పంటల ఉత్పత్తి, మత్స్యసంపద, పశుసంపద గణనీయంగా పెరిగాయని గణాంకాలతోసహా ఉదహరించారు. జలవనరుల విషయంలో కేసీఆర్ బహులాంచల వ్యూహాన్ని అవలంబించారని కొనియాడారు. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉన్నా, అందులో ఎగువ రాష్ట్రాల వాటా 63 టీఎంసీలని, అవిపోతే అందుబాటులో ఉండేది 102 టీఎంసీలేనని, ఇది సీడబ్ల్యూసీ చెప్పిందేనని, కానీ కాంగ్రెస్ ఆ సత్యాన్ని దాచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ఇంజినీర్ల ప్రతిపాదనలతో మేడిగడ్డను ఎంపిక చేశారని, బరాజ్ నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేవని తెలిపారు. ఎక్కడయినా బరాజ్‌లను ఇసుకపైనే నిర్మిస్తారని తెలిపారు. అదేవిధంగా బరాజ్‌లో భారీ స్టోరేజీ పెట్టారంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారని ఖండించారు. దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఫరక్కా, గంగా, తెహ్రీ బరాజ్‌లు ఉన్నాయని, వాటితో పోల్చితే మేడిగడ్డ స్వల్పమేనని వివరించారు.
మేడిగడ్డ బరాజ్‌ను ఇప్పటికిప్పుడు కూడా వాడుకోవచ్చని విశ్రాంత ఇంజినీర్ దామోదర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మేడిగడ్డ బరాజ్‌ను విశ్రాంత ఇంజినీర్లు వ్యతిరేకించారని చేస్తున్న ప్రచారం అసత్యమని ఖండించారు. తాము మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు జలాలను తరలించే అలైన్‌మెంట్‌ను మాత్రమే వ్యతిరేకించామని తెలిపారు. తమ అభిప్రాయాన్ని నాటి సీఎం కేసీఆర్ గౌరవించారని, ఫలితంగానే నదీమార్గంలో జలాలను తరలించేలా ప్రణాళికలకు రూపకల్పన చేశారని తెలిపారు. విశ్రాంత ఇంజినీర్ తన్నీరు వెంకటేశం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్‌గౌడ్, విశ్రాంత సీఈ ఖగేందర్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం మాజీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ఆచారి, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ కార్యదర్శి వెంకటేశం, అంతర్రాష్ట్ర వ్యవహారాల మాజీ ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ఫ్లోరోసిస్ విమోచన సమితి నాయకులు కంచుకట్ల శ్రీనివాస్, తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, సీనియర్ జర్నలిస్టు కామెర నవీన్‌కుమార్, బీసీ సంఘం నాయకుడు బొళ్ల శివశంకర్, ఏల్చల దత్తాత్రేయ పాల్గొన్నారు.