హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మురికివాడల్లో పోలీసులు వివిధ రకాల పేర్లతో చట్టవిరుద్ధంగా సోదాలు నిర్వహిస్తున్నారని, వాటిని నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మిషన్ ఛబుత్రా, ఆపరేషన్ రోమియో తదితర పేర్లతో జరుగుతున్న ఈ సోదాలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని హైదరాబాద్లోని బషరత్నగర్కు చెందిన సామాజిక కార్యకర్త ఎస్క్యూ మసూద్ ఆపిల్లో విజ్ఞప్తి చేశారు. చిన్నవ్యాపారాలు, ఫుట్పాత్ వ్యాపారాలను రాత్రి 11 గంటల్లోపే మూసివేయిస్తున్నారని, ఇలా చేయడం 2015లో జారీ అయిన జీవో 15కు విరుద్ధమని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లను ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటలకు వరకు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. అయినప్పటికీ వ్యాపారులను పోలీసులు వేధిస్తున్నారని, ఏ చట్టం కింద సోదాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పడం లేదని వివరించారు. పోలీసుల చర్య రాజ్యాంగంలోని 19, 21 అధికరణలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొంటూ.. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ సీపీలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం విచారణ జరుపనున్నది.