Future City | రంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్‌సిటీని ఆపాలని.. తెలంగాణను కాపాడాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మాసిటీ స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని ఫ్యూచర్‌సిటీకి కేటాయించడం చట్ట విరుద్ధమని, ఫార్మాసిటీ కోసం చట్ట ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకుని సేకరించిన భూమిని మరో ప్రయోజనం కోసం మళ్లించడం చట్టరీత్యా చెల్లదని… ఆ భూమిని తిరిగి రైతులకే ఇవ్వాలనే నినాదంతో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేసింది. కానీ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దుచేశామని, అందులో ఫ్యూచర్‌సిటీని కడుతున్నామని చెబుతున్నది. చట్టప్రకారం నిర్దిష్ట ప్రయోజనాల కోసం పర్యావరణ అనుమతులు తీసుకున్న భూమిని ఆ ప్రయోజనం కోసమే కేటాయించాలి. మరో ప్రయోజనం కోసం మళ్లించడం చట్టరీత్యా చెల్లదు. అలాంటి భూమిని తిరిగి రైతులకే అప్పగించాలి. కానీ, ఆ భూమిని మరో ప్రయోజనాల కోసం కేటాయించినట్లయితే గ్రామసభల ద్వారా మళ్లీ ప్రజల ఆమోదం తీసుకుని, ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్టుకు సూచించి శాస్త్రీయ అభిప్రాయం తీసుకొని, కొత్తగా పర్యావరణ అనుమతులు పొందాలి.
అవేమీ చేయకుండా ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూముల్లో ఫ్యూచర్‌సిటీకి మళ్లించడం సాధ్యం కాదు. అలాగే, కొత్తగా భూములను తీసుకోవాలనుకున్నప్పుడు ప్రజల సమ్మతితో అదనంగా భూములు సేకరించాలి. నిజానికి ఫార్మాసిటీ ప్రాజెక్టును నిలిపివేసినట్టు ప్రభుత్వమే చెబుతున్నది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ కోసం తీసుకున్న పర్యావరణ అనుమతులను సస్పెండ్ చేయాలి. కొత్త ఈసీ కోసం మళ్లీ దరఖాస్తు చేయాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి పనులు చేయలేదు. ప్రజల అనుమతులు లేకుండా ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించించింది. ఇది చట్టరీత్యా సమంజసం కాదు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన ఈ మండలాల్లోని గ్రామప్రజలను వారి సమ్మతి లేకుండా, వారి అభిప్రాయం తీసుకోకుండా, ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి తెస్తున్నారు. ప్రజాపాలన తీసుకువస్తామని ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్థానిక ప్రజల నిరసనలను పూర్తిగా విస్మరిస్తూ, వారి గొంతులను నొక్కుతున్నదని ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వ్యవసాయ భూముల్లో బలవంతంగా కంచె వేసినట్టు కమిటీ సభ్యులు వాపోతున్నారు. ఏప్రిల్ 3 నుంచి యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో వందలమంది పోలీసులను మోహరించి, రైతులను బెదిరించి కంచె వేస్తున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులపై త్వరలో కోర్టు ధిక్కరణ కేసులు వేయటానికి రైతులు సిద్ధమవుతున్నారు.
ఫ్యూచర్‌సిటీ పేరిట ప్రభుత్వం చేస్తున్న చర్యల కారణంగా ఒక్క కలంపోటుతో 56 గ్రామాల స్వయంపరిపాలన హక్కులు కోల్పోతున్నాయి. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన ఇక్కడి ప్రజలు వారి సమ్మతి లేకుండానే, వారి అభిప్రాయం తీసుకోకుండానే ఫ్యూచర్‌సిటీలోకి నెట్టివేయబడుతున్నారు. ఫ్యూచర్‌సిటీ అథారిటీ చెప్పింది వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల హక్కులు హరించే అధికారం ప్రభుత్వాలకు లేదు. మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల నుంచి సుమారు వెయ్యిమంది రైతులు భూసేకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవద్దని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అలాగే, భూములు లేని కూలీలు, రైతుల సమ్మతి లేకుండా అసైన్డ్, సీలింగ్ వంటి భూములను కూడా తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో మేడిపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలు పూర్తిగా స్టే ఆర్డర్ కింద ఉన్నాయి. అయినప్పటికీ రేవంత్ సర్కారు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఆన్లైన్ రికార్డుల్లో రైతుల పేర్లను పునరుద్ధరించాలని, రైతులకు పంటరుణాలు, రైతుబంధు ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ వాటిని కూడా పట్టించుకోవటం లేదని అన్నదాతలు వాపోతున్నారు.
చట్ట ప్రకారం ఒక్క నిర్దిష్టమైన ప్రయోజనం కోసం పర్యావరణ అనుమతులు తీసుకున్న భూమిని మరొక ప్రయోజనం కోసం దారిమళ్లించటం చట్టరీత్యా చెల్లదు. నేరం కూడా. ఇలాంటి చర్యలు తీసుకోవాలంటే చట్టప్రకారం తగు విధివిధానాలను అనుసరించాలి. కొత్తగా ఎన్విరాన్మెంట్ రిపోర్టు, వివరణాత్మకమైన ప్రాజెక్టు రిపోర్టులు ప్రజల ముందు ఉంచాలి. పబ్లిక్ హియరింగ్‌లు, గ్రామ సభల ద్వారా ప్రజల ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత శాస్త్రీయ అభిప్రాయం తీసుకుని కొత్తగా పర్యావరణ అనుమతులు పొందాలి. ప్రజల సమ్మతితో మాత్రమే అదనపు భూమిని సేకరించాలి. ఈ నిబంధనలను పాటించకుండా భూమిని మరో ప్రాజెక్టుకు బదలాయించటం చట్టరీత్యా నేరం. ప్రభుత్వం తీసుకున్న చట్ట వ్యతిరేక విధానాలపై త్వరలో కోర్టును ఆశ్రయిస్తాం. అలాగే, గ్రామాల స్వయం పరిపాలన హక్కులను కాలరాస్తున్న విధానాన్ని కూడా కోర్టుకు వివరిస్తాం. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వేసిన కంచెను కూడా తొలగించాలనే ప్రధాన డిమాండ్లతో ముందుకెళ్తాం. ఫ్యూచర్‌సిటీకి వ్యతిరేకంగా త్వరలో చేపట్టబోయే పోరాటం కోసం రైతులను కూడా ఉద్యమానికి సమాయత్తం చేస్తాం.
బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించినప్పుడు… ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు భూసేకరణ చట్ట విరుద్ధమని వాదించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేస్తామని, రైతుల పేర్లను ఆన్లైన్లో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారు. ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను రైతులకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గోడు పట్టించుకోవటం లేదు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీని రద్దుచేశామని, దాని స్థానంలో ఫ్యూచర్‌సిటీని స్థాపిస్తామని బహిరంగంగా చెబుతున్నారు. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూమిని ఫ్యూచర్‌సిటీకి బదలాయించటమే కాకుండా అదనంగా మరో 30 వేల ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా కమిటీ పిలుపునిచ్చింది.