వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల సాగు, రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం వరంగల్లోని కాకతీయ హరిత హోటల్లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ , పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులచే ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి ఆదేశించారు. గంజాయి రవాణా చేస్తున్న సాగుచేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి బైండోవర్ చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, విద్యాసంస్థల నిర్వాహకులకు ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖల అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు.
గంజాయి సాగుచేస్తున్నా, రవాణా చేస్తున్న వారిపై, అందుకు సహకారాన్ని అందించే ఎంతటి వారైనా వారిని చట్టరీత్యా కేసులు నమోదు చేసిన అధికారులకు ప్రభుత్వం తరపున అవార్డుల ను అందించి ప్రోత్సహిత్సామన్నారు.
గ్రామాల్లో గంజాయి సాగు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రచారం నిర్వహించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైల్వే, బస్ లలో గంజాయి రవాణా కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ వరంగల్ జిల్లా సూపరిటెండెంట్ శ్రీనివాస రావు, శంషాబాద్ సూపరిటెండెంట్ సత్యనారాయణ, ఏఈఎస్ కరమ్ చంద్, హనుమకొండ పోలీస్ శాఖ ఏసీపీ జితేందర్ రెడ్డి, సుబేదారి సీఐ రాఘవేంద్ర, హన్మకొండ ఆబ్కారీ శాఖ సీఐ రామకృష్ణ పోలీసు, ఆబ్కారీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.