హైదరాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-13 నుంచి గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. భూసేకరణ ప్రక్రియపై యథాతథ స్థితిని కొనసాగించాలని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం 2024 అక్టోబర్‌లో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ 30మంది హైకోర్టును ఆశ్రయించారు.
వారి తరఫున సీనియర్ న్యాయవాది జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ భూసేకరణ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నదని పేర్కొన్నారు. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా అధికారులు భూములను స్వాధీనం చేసుకోవడాన్ని అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. రోడ్డు కోసం 447 ఎకరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చాలామంది భూములిచ్చేందుకు అంగీకరించి పరిహారం తీసుకున్నారని, వారిలో కొందరు పిటిషనర్లు కూడా ఉన్నారని చెప్పారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణ ప్రక్రియ తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని విచారణను 29కి వాయిదా వేసింది.