హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై రూ.3 కోట్ల వ్యయంతో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ భారీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్నది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్‌బండ్‌పై సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని భారీ విగ్రహ ఏర్పాటుకు నిధులు విడుదల చేయడంపై సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బడుగు నేతకు ప్రాధాన్యమివ్వడంపై సీఎం కేసీఆర్‌కు పల్లె లక్ష్మణ్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.