KTR | స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో తొందరలోనే ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ ఉప ఎన్నికలో తప్పకుండా రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్పూర్ నుంచి కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక రావడం ఖాయమని.. బీఆర్ఎస్ గెలవడం ఖాయమని కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టులో కూడా తీర్పు రిజర్వ్ చేశారని.. సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ వేశామని కేటీఆర్ అన్నారు. కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్ మీద తీర్పు హైకోర్టులో రిజర్వ్‌లో ఉందని అన్నారు. మిగతా వాళ్ల మీద సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉందన్నారు. ఇదే విషయమై ఢిల్లీలో కూడా కలిశామని చెప్పారు. ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. అందుకే స్పీకర్ చేస్తున్న జాప్యం, రాజకీయ పక్షవాత వైఖరిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ నుంచి దూరమైన మంచి నాయకులు తిరిగి రావడం విజయఢంకా మోగించడానికి మంచి ముందడుగు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అని చెప్పారు.