వరంగల్, మార్చి 7 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. రైతులకు సాగు, తాగునీరు, కరెంటు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. గురువారం హనుమకొండలోని తన నివాసంలో కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వందరోజులు కావస్తున్నా పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలను, రైతులను మోసం చేసిందని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు.
ఇప్పటికే రైతుబంధు, సాగునీరు, కరెంటు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలం రా ముని సన్నిధిలో ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఇండ్ల ముసుగులో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నదని విమర్శించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభు త్వం.. అందుకు బడ్జెట్లో రూ.7,740 కోట్లు మాత్రమే కేటాయించిందని, వాటి నిర్మాణం పూర్తి కావాలంటే రూ.25 వేల కోట్లు కావాలని కడియం పేర్కొన్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్నవారు 90 లక్షల మంది ఉంటే నిబంధనల పేరుతో 29 లక్షల మందికే రూ.500 గ్యాస్ పథకం అమలు చేస్తున్నారని చెప్పారు.