Devunoor Forest | వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణప్రతినిధి): దేవునూర్ ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతంలో 43.38 ఎకరాలపైనే అటవీ శాఖకు, కొందరి మధ్య వివాదం ఉన్నదని.. మిగిలిన 3,900 ఎకరాలు అటవీ శాఖకు చెందినవేనని హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్ తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విన్నపం మేరకు హనుమకొండ కలెక్టర్ ఆదేశాలతో 43.38 ఎకరాలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
అటవీ ప్రాంతంలోని భూముల నిర్ధారణపై అటవీ, రెవెన్యూ శాఖ సంయుక్త సర్వే నివేదికలోని అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, అందుకు అటవీ శాఖ అధికారులు అభ్యంతరం చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘కారడవిలో పాగాకు ముంజేతి కడియం’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై హనుమకొండ ఆర్డీవో వివరణ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా.. ‘ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామ రైతులు పట్టా భూములు సాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అటవీ సిబ్బంది అడ్డుకున్నారని వారు తమ బాధను స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి విన్నవించారు.
ఎమ్మెల్యే ఈ విషయాన్ని హ నుమకొండ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి జాయింట్ సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే కడియం విన్నపం మేరకు హనుమకొండ కలెక్టర్ ఆదేశాల ప్రకారం అటవీ, రెవె న్యూ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. ఇనుపరాతి గుట్ట ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్టు బ్లాక్ చేసేందుకు ముప్పారం, దేవునూర్, ఎర్రబెల్లి, దామెర, కొత్తపల్లి పరిధిలో 3,750 ఎకరాల విస్తీర్ణంతో అటవీ శాఖ 60ఏండ్ల క్రితం ప్రతిపాదనలు పంపిం ది. ఆ తర్వాత అటవీ, ఉమ్మడి సర్వేతో 3,956 ఎకరాలను ఫారెస్టు బ్లాక్ ఏర్పాటుకోసం తమ ఆధీనంలో ఉన్నట్టుగా నిర్ధారించింది.
ముప్పారంలోని 213, 214, 215, 216 సర్వే నంబర్లు… దేవునూర్లోని 403, 404 సర్వే నంబర్ల భూములు అటవీశాఖ ముసాయిదా నోటిఫికేషన్లో లేవు. అయినా 43.38 ఎకరాల విస్తీర్ణంలోని ఈ భూములు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నట్టుగా గుర్తించింది. రెవెన్యూ రికార్డుల్లో పైసర్వే నంబర్ల భూముల్లో వారసత్వ, కొనుగోలు పద్ధతిలో 23 మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. 43.38 ఎకరాలపైనే అటవీ శాఖకు, కొందరికి మధ్య వివాదం ఉన్నది. మిగిలిన 3,900 ఎకరాలపై వివాదం లేదు. ఈ విషయమై సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పించగా పట్టాదారులకు భూములు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ శాఖ జిల్లా అధికారులు సర్వే నివేదిక అంశాలను ఆ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించి ఆదేశాల కోసం సమయం కోరారు’ అని హనుమకొండ ఆర్డీవో పేర్కొన్నారు.