నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 23 : రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షానికి పలుచోట్లు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్‌లో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. 25 మంది రైతులకు చెందిన 100 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకపోగా, మరికొంత తడిసి ముద్దయింది. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలో వర్షంతో నష్టపోయిన వరి పంటలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మంత్రులు, అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు. మక్కలు కొనుగులు చేయకుండా కల్లాల్లోనే ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నా.. అకాల వర్షానికి తడిచి నష్టపోతున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లాలోని కొండపాక, నారాయణరావుపేట, సిద్దిపేట మండలాల్లో బలమైన గాలులతోపాటు వర్షం కురిసింది. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. మక్కలు కొట్టుకుపోయాయి. నర్సాపురంలో గాలికి చెట్టు విరిగి కారుపై పడడంతో ధ్వంసమైంది. నారాయణరావుపేట మండలంలోని బంజేరుపల్లి, ఇబ్రహీంపూర్, కోదండరావుపల్లి గ్రామాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. కొండపాక మండలంలోని మర్పడగలో ఆరపోసిన ధాన్యం వర్షానికి కొట్టుకపోయి మట్టిలో కలువడంతో రైతు వాపోయాడు. బందారం, మర్పడగ, రాంపల్లి , దుద్దెడదర్గా, సిరిసినగండ్ల, కొండపాక గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన కౌలు రైతు కమ్మల సాయికుమార్ రెండు ఎకరాల్లో సాగు చేసిన మక్క పంట పిడుగుపాటుకు పూర్తిగా దగ్ధమైంది. రూ.3 లక్షల విలువ చేసే పంట కాలిపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.