హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ‘ఏక్ పోలీసు’ వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక పట్టించుకోవడం లేదని టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శనివారం అన్ని బెటాలియన్ల నుంచి కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రోడ్లమీదకు వచ్చారు. కొందరు టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఏకంగా తమ బెటాలియన్లలోనే ఆందోళనలకు దిగారు. ఆయా బెటాలియన్ల కానిస్టేబుళ్లతో మట్టి, ఇసుక మోయించడం, చెట్లను కొట్టించడం, గడ్డి పీకించడం వంటి పనులు చేయిస్తున్నారని, తమ బతుకు ‘హోంగార్డుకు ఎక్కువ.. కానిస్టేబుల్‌కు తక్కువ’ అన్న చందంగా ఉందని ఉన్నతాధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు.
‘టీజీఎస్పీ వద్దు.. ఏక్ పోలీస్ ముద్దు’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ‘రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే రోడ్డెక్కారు.. పోలీసులకు భరోసా ఇచ్చే హోంమంత్రి లేడు. హామీ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పక్క రాష్ర్టాలకు తిరుగుతున్నాడు’ అని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ‘టీజీఎస్పీ కానిస్టేబుళ్లను పెండ్లి చేసుకోమన్నది ఎవరమ్మా?’ అంటూ ఉన్నతాధికారులే తమ భార్యలకు కౌన్సెలింగ్ ఇవ్వడం దారుణమని కానిస్టేబుళ్లు వాపోతున్నారు.
28న యూనిఫాంలోనే ఆందోళనలు..
తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఈనెల 28న యూనీఫాంలోనే సచివాలయం ముట్టడికి బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు పిలుపునిచ్చారు. ఇప్పుడు తప్పితే.. ఇక ఎప్పటికీ ఏక్ పోలీసు వ్యవస్థను సాధించుకోలేమని భీష్మించుకొని కూర్చుకున్నారు. సోమవారం నాటి ఆందోళనలకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే డీజీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆందోళనల్లో పాల్గొన్నవారిని సస్పెండ్ చేసేందుకు ఆయా బెటాలియన్ల కమాండెంట్లు ఆర్డర్స్‌ను సిద్ధం చేస్తున్నట్టుగా విశ్వనీయంగా తెలిసింది.