Mulugu Encounter | ములుగు, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 1న ములుగు జిల్లా చెల్పాక వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురు మావోయిస్టులకు విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 30న ఏడుగురితో ఉన్న దళం చెల్పాక పంచాయతీలోని వలస ఆదివాసీ గ్రామంలో నమ్మిన వ్యక్తికి భోజనాలు ఏర్పాటు చేయమని కోరారని తెలిపారు. అప్రూవర్‌గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం కలిపి స్పృహ కోల్పోయేలా చేశారని చెప్పారు. చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు కాల్చి చంపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు వెల్లడించారు. ప్రజాస్వామికవాదులు, విద్యాలయాలు, వ్యాపారసంస్థలు బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, బాధ్యత వహించి, న్యాయ విచారణ జరిపి పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 5 : మవోయిస్టులు ఇద్దరు మాజీ సర్పంచ్‌లను దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది. బీజాపూర్ జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్‌లు సుఖ్రామ్ ఆవ్లం, సుక్లు ఫర్సాను మావోయిస్టులు మంగళవారం అర్ధరాత్రి అపహరించుకెళ్లారు. పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారనే నెపంతోవారిని హత్య చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటన బైరామ్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.