అవకాశాల్లో, అధికారంలో న్యాయమైన వాటా కోసం కొట్లాడుతున్న బీసీ సోదరుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇంటింటి సర్వే పేరుతో చేపట్టిన కులగణన ఫలితాలు బడుగు జీవుల భవితకు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి. జనాభాలో 60 శాతానికి పైబడి ఉన్నామని, కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా కనీసం 42 శాతం కోటా అయినా తమకు ఇవ్వాలని ఒకవైపు బడుగుజీవులు ఆక్రోశిస్తుంటే.. అసలు మీరు 46.25 శాతానికి మించి లేరని కాంగ్రెస్ సర్కారు లెక్కలేసింది. 2011 జనాభా లెక్కలతో, 2014లో సమగ్ర కుటుంబసర్వేతో పోల్చిచూసినా, తాజా గణాంకాలు పొంతన లేకుండా ఉన్నాయి.
చిత్రమేమిటంటే.. రాష్ట్ర జనాభా వృద్ధిరేటుపై ఆధికారిక అంచనాను కూడా తోసిరాజంటూ తెలంగాణ జనాభానే తగ్గించి చూపేలా ఈ సర్వే ఫలితాలు ఉండటం విస్తుగొల్పుతున్నది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కారు కసరత్తు చేస్తుండగా.. మనకు మనమే జనాభాను తగ్గించి చూపడం మన వేలితో మన కన్నును పొడుచుకోవడంకంటే అధ్వానమని నిపుణులు చెప్తున్నారు. కేంద్ర పథకాలు, నిధులు జనసంఖ్య ఆధారంగానే వస్తున్న నేపథ్యంలో జనాభాను తగ్గించి చూపడం ఎవరి ప్రయోజనాల కోసమో అర్థంకావడం లేదు. అనేక లక్షల కుటుంబాల నుంచి వివరాలు తీసుకోలేదని సాక్షాత్తు మంత్రులే చెప్తుంటే.. ఈ సర్వేకు సార్థకత ఎంత? ఆ నివేదిక సమగ్రత ఎంత? దాని తీసుకున్న నిర్ణయాల విలువెంత? ఇదీ ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం.మ్యాకం రవికుమార్
Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు వెల్లడించిన కులగణన సర్వే తీరు ‘నవ్విపోదురు గాక నాకేటి..’ అన్న చందంగా ఉన్నది. సర్వే లెక్కలు చూస్తుంటే తెలంగాణలో అసలు ఎవరూ పిల్లలను కనడమే లేనట్టు.. జనాభా వృద్ధి పెద్దగా లేనే లేదన్నట్టు తేల్చేశాయి. దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు మొత్తంగా 0.54 శాతమేనని, ఈ పదేండ్లలో పెరిగిన రాష్ట్ర జనాభా కేవలం 2 లక్షల మందేనని ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే నివేదికలో వెల్లడించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. జనాభా వార్షిక వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర జనాభా 4.18 కోట్లుగా ఉంటుందని అంచనాలు వేస్తుండగా, తాజా సర్వే గణాంకాలు అందుకు పూర్తి భిన్నంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ సర్వే యావత్తు తప్పుల తడకగా ఉన్నదని ఇప్పటికే కులసంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజా గణాంకాలు ప్రజా, కుల సంఘాలు, సామాజికవేత్తల వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
పదేండ్లలో పెరిగింది 2 లక్షల మందేనట!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, భూ యాజమాన్య, వృత్తి సంబంధ అంశాలపై కచ్చితమైన సమాచారం సేకరించాలని భావించారు. అందులో భాగంగా 2014 ఆగస్టు19న రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో, దేశచరిత్రలోనే అపూర్వమైన రీతిలో ‘స్వయం నిర్ణయం – అర్హులకే సంక్షేమం’ లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఏకకాలంలో సమర్థంగా నిర్వహించింది. సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. సర్వే రోజున ఏ ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలనే అంశాన్ని ముందుగానే ప్రకటనల ద్వారా ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించింది. ప్రజలను సర్వేకు అన్నివిధాలా సంసిద్ధులను చేసింది. మరోవైపు సర్వే కోసం అధికార యంత్రాంగాన్ని సైతం అదే తరహాలో తర్ఫీదునిచ్చింది.
మొత్తంగా ఒకేరోజున 3.85 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి, కుటుంబాల వివరాలు పలుచోట్ల పునరావృతం కాకుండా 1.3 కోట్ల కుటుంబాల వివరాలను విజయవంతంగా సేకరించింది. 8 అంశాలపై 94 ప్రశ్నలతో రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సామాజిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, కుల, ఉపకులాల గణాంకాలన్నింటినీ సేకరించి దేశాన్నే అబ్బురపరిచింది. ఆ సర్వే ద్వారా తెలంగాణ జనాభా 3,68,76,544గా లెక్క తేలింది. 2011-2014లో అంటే ఎస్కేఎస్ సర్వే నిర్వహించేనాటికి అంటే మూడేండ్లలోనే రాష్ట్ర జనాభా 20,73,880 (5.07 శాతం) మంది పెరిగారు. ఇదిలా ఉంటే పదేండ్ల అనంతరం అంటే ప్రస్తుతం 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించింది. రాష్ట్ర జనాభా 3,70,77,544 మందిగా తాజాగా నిర్ధారించింది. నికరంగా 2014-2024 వరకు పెరిగిన జనాభా 201000 మంది కావడం గమనార్హం. దశాబ్ద కాలంలో రాష్ట్రంలో పెరిగిన జనాభా కేవలం 0.54 శాతమేనని తేల్చడంపై సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
2011 జనాభా లెక్కలతో పోల్చినా..
2014 సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కలతో పోల్చినా ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలు పూర్తిగా అసంబద్ధంగానే ఉన్నాయి. 2001-2011 జనాభా వృద్ధి రేటును అనుసరించి తెలంగాణ రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధి రేటు 1.35 శాతంగా నిర్ధారించారు. 2011-2024లో అంటే గడచిన 13 ఏండ్లలో రాష్ట్ర జనాభా దాదాపు 70 లక్షలకు పైగా పెరగాలి. ఆ లెక్కన ప్రస్తుతం 2024 నాటికి రాష్ట్ర జనాభా 4.18 కోట్లుగా ఉండాలనేది ఒక అంచనా. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గడిచిన 13 ఏండ్లలో అంటే 2011-2024 మధ్యలో రాష్ట్ర జనాభా 20,73,880 (5.07 శాతం) మంది మాత్రమే పెరిగారు. అంచనా వేసిన జనాభాలో దాదాపు 50 లక్షల మంది తక్కువ ఉన్నారు. ఇంత భారీ వ్యత్యాసం ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పిల్లలనే కనడం లేదా?
ప్రభుత్వం తాజాగా వెల్లడించిన ఇంటింటి సర్వే గణాంకాల ప్రకారం దశాబ్ద కాలంలో పెరిగిన రాష్ట్ర జనాభా 201000 మాత్రమే. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 నుంచి 2023 నాటికే 13.15 లక్షల మందికి పెండ్లిళ్లు అయ్యాయి. ఈ ఏడాదిలో మ రో లక్షకు పెరిగింది. నికరంగా 14 లక్షలకు పైగా పెండ్లిళ్లయ్యాయనేది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల సంఖ్యనే తేటతెల్లం చేస్తున్నది. వారంతా బీపీఎల్ పరిధి కుటుంబాలే. ఇవిగాకుండా రిజస్టర్, ఇతర అనధికారికంగా జరిగిన పెండ్లిళ్ల సంఖ్య అంతకు రెట్టింపు సంఖ్యలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే 2017 జూన్ నుంచి 2023 జూన్ మధ్య ఆరేళ్ల కాలంలోనే ప్రభుత్వ దవాఖానల్లో 14 లక్షలకు పైగా ప్రసవాలు కాగా, ఆ మేరకు కేసీఆర్ కిట్లను అందజేశారు. అంటే ఆ మేరకు జనాభా కూడా పెరిగింది. కానీ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన ఇంటింటి సర్వే గణాంకాల్లో ఆ సంఖ్య ప్రతిబింబించకపోవడం గమనార్హం. మొత్తం పదేండ్ల కాలంలో పెరిగిన జనాభా 201000 ఉండడంపై సామాజికవేత్తలు ముక్కునవేలేసుకుంటున్నారు. ప్ర భుత్వ గణాంకాలు ఎంత అసంబద్ధమో ఇంతకంటే నిదర్శనమేమున్నదని ప్రశ్నిస్తున్నారు.
2.60 లక్షలు తగ్గిన ఎస్సీ జనాభా
ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 2.60 లక్షల మందికిపైగా తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 54,08,800 (15.45 శాతం). అయితే 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర ఎస్సీ జనాభా 64,44,584 మందిగా (18శాతం) లెక్కతేల్చింది. కాంగ్రెస్ సర్కారు సర్వేలో ఎస్సీ జనాభా 260265 మందికి తగ్గింది. ఎస్సీ జనాభా కేవలం 17.43 శాతమేనని నిర్ధారించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఎస్సీ వర్గాలు తమ జనాభా 20 శాతానికి పెరిగి ఉంటుందని చెప్తుంటే, అందుకు భిన్నంగా రాష్ట్ర గణాంకాలు ఎస్సీ జనాభా తగ్గినట్టు చూపడం గమనార్హం.
బీసీ జనాభాపై అంతటా విస్మయం
రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన బీసీ జనాభా శాతంపైనా సర్వత్రా గందరగోళం నెలకొన్న ది. రాష్ట్ర జనాభాలో బీసీలు 1,64,09,179 మంది (46.25శాతం)అని ప్రభుత్వం ప్రకటించింది. బీసీ ముస్లింలు 35,76,588 మంది (10.08శాతం)గా వెల్లడించింది. రెండింటిని కలిపి బీసీ జనాభా 56.33 శాతం అని లెక్కతేల్చింది. దీనిపై బీసీ సం ఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ ముస్లింలు కాకుండానే బీసీల జనాభా 51 శాతానికి పైగా ఉంటుందని నేతలు చెప్తు న్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ గణాం కాలు ఉన్నాయని మండిపడుతున్నాయి.
01
02
03
04
05
06
07
08
వివిధ సర్వేల(కులగణన) వివరాలు..
2011 జనాభా లెక్కలు మొత్తం కుటుంబాలు83,03,612
2014 ఎస్కేఎస్ లెక్కలు ; 1,03,95,629
2024 ఇంటింటి సర్వే ;1,15,79,457
నోట్: ఇంటింటి సర్వేలో పాల్గొన్న జనాభా 3,54,77,554 కాగా, సర్వేకు దూరంగా ఉన్నవారు 16 లక్షల మంది వార్షిక జనాభా వృద్ధిరేటుతో పోల్చితే ఉండాల్సిన జనాభా..
(నోట్: ప్రొజెక్షన్ లెక్కలు 2001-2011 మధ్య గ్రోత్‌రేట్ వార్షిక గ్రోత్‌రేట్ 1.35. 2014నుంచి2024 వరకు మొత్తం వృద్ధి రేటు 13.58శాతంకాగా, ఆ మేరకురాష్ట్ర జనాభా వృద్ధి రేటు పెరుగుతుందనేది అంచనా.)