మంత్రి ఓఎస్డీ ఓ పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించారని పోలీసులు వెళ్లారు. మంత్రి కూతురు బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది సీఎం రేవంత్‌రెడ్డి, బెదిరించింది ఆయన అనుచరుడు రోహిణ్ రెడ్డి అని చెప్పారు. మంత్రి బిడ్డ ఇంత బాహాటంగా చెప్పినా పోలీసులు కేసులెందుకు నమోదు చేయలేదు.
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ముసుగులో రౌడీ పాలన నడుపుతున్నరు. ముఖ్యమంత్రి, మంత్రులు అలీబాబా దొంగల్లా, దండుపాళ్యం ముఠాల్లా తయారై దోపిడీ పర్వానికి తెరలేపారు. పాలనను గాలికొదిలి వాటాల కోసం కొట్టుకుంటున్నరు. పారిశ్రామికవేత్తల కణతలపై గన్నులు పెట్టి మూటల పంపకాల్లో మునిగితేలుతున్నరు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ బాటిళ్లపై స్టిక్కర్ల కాంట్రాక్టు కోసం సీఎం రేవంత్ అల్లుడు, మంత్రి కొడుకు పోటీపడి ఓ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను బలిపశువు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అన్నదమ్ములు, అనుచరులు కలిసి రాష్ట్రాన్ని పంచుకొని దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరిట అర్రాస్పాట పాడి ఇప్పుడు నిధుల్లేవని సాకులు చెప్తూ తప్పించుకుంటున్నారని ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ అంటేనే మోసాలకు కేరాఫ్ అని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వడ్డెర, హోటల్స్ రెస్టారెంట్స్ అండ్ బేకర్స్ కార్మిక యూనియన్ల నాయకులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడి సాధకబాధకాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న వర్గాలకు అండగా ఉంటామని అభయమిచ్చారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్, వడ్డెర సంఘం మహిళా నేత జయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ తాతామధు తదితరులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకుదెరువుకు హైదరాబాద్‌కు వచ్చిన చిన్నాచితక కార్మికులు కాంగ్రెస్ పాలనలో చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో నిశ్చింతగా బతుకులు వెళ్లదీసిన వారు రేవంత్ హయాంలో అరిగోసపడుతున్నారని పేర్కొన్నారు.
మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఈ విషయాలపై రాహుల్‌గాంధీ మైనార్టీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.‘తెలంగాణలో రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తున్నారు. ఇకడి కాంగ్రెస్ నేతలంతా బీజేపీతో కలిసిపోయారు. బీజేపీ ఎంపీలకు పిలిచి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తున్నది. అలాంటి రెండు జాతీయ పార్టీలు దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటిని బీ టీమ్‌లు అనడం సిగ్గుచేటు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఓఆర్ఆర్ లోపల ఏ ఒక్క సీటు ఇవ్వకుండా నూటికి నూరుశాతం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేశారు. కానీ పల్లె ప్రజలు హస్తంపార్టీ నేతల హామీలకు ఆశపడి ఓటేసిన పాపానికి ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. నగర ప్రజలు తమను నమ్మలేదనే కోపంతో కాంగ్రెస్ పాలకులు హైడ్రాను తెచ్చి ప్రతీకార రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. హైడ్రా పేరిట బుల్డోజర్లను తెచ్చి పేదల ఇండ్లను నేలమట్టం చేసి వారికి తీరని దుఃఖాన్ని మిగిల్చారని విమర్శించారు. హైడ్రా పెద్దోళ్లకు ఓ నిబంధనలు, పేదోళ్లకు వేరే నిబంధనలు పాటించడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో మరో మూడేండ్లలో రాబంధుల రాజ్యం పోయి కేసీఆర్ రైతుబంధు రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వడ్డెర సోదరులు, హోటళ్ల కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. వడ్డెరులకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇప్పించేందుకు అసెంబ్లీలో, బయటా కొట్లాడుతామని పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇండ్లు ఇప్పిస్తామని, వారి పిల్లలకు గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కేటాయిస్తామని భరోసాఇచ్చారు. అలాగే హోటళ్లు, బేకరీల యాజమానులు, కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని కారుకు ఓటేసి సారుకు అండగా నిలువాలని మరోసారి విజ్ఞప్తిచేశారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుపెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని పునరుద్ఘాటించారు.
‘వృద్ధులు, ఒంటరి మహిళల పింఛన్లు రూ. 4,000 వేలు కావాలన్నా.. మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు రూ. 2,500 రావాల న్నా.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టాలి. ఓటుతో సీఎం రేవంత్‌రెడ్డి చెంపలు వాయించి బుద్ధిచెప్పాలి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కారుకు ఓట్లు గుద్దితే రేవంత్‌రెడ్డి గూబ గుయ్యిమనాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం వడ్డెర సంఘం సమావేశానికి హాజరై మాట్లాడారు. మంత్రులకు మంత్రుల మధ్య, ముఖ్యమంత్రికి, మంత్రులకి మధ్య సమన్వయం కొరవడి పాలన కుంటుపడిందని విమర్శించారు. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో కొట్లాడుకుంటూ ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. మొన్న కొండా సురేఖ, నిన్న జూపల్లి వ్యవహారాలే కాంగ్రెస్ అరాచక విధానాలకు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజా వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే. వక్ఫ్ చట్టాన్ని అమలు చేస్తూ తెలంగాణ ముస్లింలకు రేవంత్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇకడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయడం విడ్డూరంగా ఉంది.
-కేటీఆర్
కేసీఆర్ పదేండ్ల పాలనలో పేదలకు న్యాయం జరిగిందని హరీశ్‌రావు సిద్దిపేటలో వేలాది మంది వడ్డెరలకు ట్రాక్టర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించామని గుర్తుచేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ. 20 కోట్ల విలువైన స్థలం కేటాయించారని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ట్రాక్టర్లలో మొరం కొట్టుకొనే వడ్డెరలను అక్రమ కేసుల పేరిట ఇబ్బందులు పెడుతున్నదని ఆరోపించారు. కేసీఆర్‌తో తాను, కేటీఆర్ మాట్లాడి వడ్డెర బిడ్డలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ హైదరాబాద్‌లో లక్ష డబుల్బెడ్రూం ఇండ్లు కట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపారని హరీశ్‌రావు కొనియాడారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా తెచ్చి లక్ష ఇండ్లు కూలగొట్టి వారి బతుకులను ఛిద్రం చేశారని నిప్పులు చెరిగారు. హైడ్రా పోవాలంటే కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిచెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి డబ్బు మూటలు, రౌడీమూకలను నమ్ముకుంటే బీఆర్ఎస్ మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలను నమ్ముకున్నదని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి 22 నెలల పాలనలో ఏ ఒక్క మంచిపని చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. కనీసం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టిన ఆయన, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లు, చేపట్టిన అభివృద్ధి పనుల రిబ్బన్లు కట్‌చేస్తూ మంచి కటింగ్ మాస్టర్‌గా పేరుగాంచారని ఎద్దేవా చేశారు. భర్తను కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో మాగంటి సునీతమ్మ జూబ్లీహిల్స్ బరిలో నిలుచున్నారని హరీశ్‌రావు చెప్పారు. భర్తను కోల్పోయిన మహిళకు వారి ముగ్గురు పిల్లలకు బీఆర్ఎస్, కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. కానీ కాంగ్రెస్ మంత్రులు ఆమె కన్నీళ్లను అపహాస్యం చేయడం దుర్మార్గమని అన్నారు.
కేసీఆర్ ఆశీర్వాదంతో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న సునీతమ్మ గెలుపులో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ తాతామధు పిలుపునిచ్చారు. స్నేహానికి విశ్వాసానికి మారుపేరైన వడ్డెరులు ఇచ్చిన మాట తప్పరని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సునీతమ్మను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మకు మద్దతుగా పెద్దసంఖ్యలో తరలివచ్చిన వడ్డెర బిడ్డలకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభినందలు తెలిపారు. కేసీఆర్ హయాంలోనే వడ్డెర కులస్థులకు మేలు జరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అరిగోస పడాల్సి వస్తుందని చెప్పారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో పదవులు, వాటాలు, మూటల కోసం కొట్లాడుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను సైతం కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు.

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా వడ్డెరులకు ఒరిగిందేమీలేదని, కానీ కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతే సముచితగౌరవం దక్కిందని వడ్డెర సంఘం మహిళా నేత జయలక్ష్మి చెప్పారు. వడ్డెరుల జీవనస్థితిగతుల అధ్యయనానికి కేకే ఆధ్వర్యంలో కమిటీ వేశారని గుర్తుచేశారు. ఫెడరేషన్ ద్వారా పనిముట్ల కొనుగోలుకు రూ. 30లక్షలు మంజూరు చేశారని తెలిపారు. అలాగే గల్లీలో ఉన్న తనను ఢిల్లీకి తీసుకెళ్లి ఫెడరేషన్ డైరెక్టర్‌గా చేశారని కొనియాడారు. ఉప్పల్ భగాయత్‌లో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి విలువైన స్థలం కేటాయించారని చెప్పా రు. ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయితేనే వడ్డెరులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కారు గుర్తుకే వడ్డెరుల మద్దతు ఉంటుందని ప్రకటించారు.
మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే ఏర్పడింది. ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాలపై రాహుల్‌గాంధీ మైనార్టీలకు సమాధానం చెప్పాలి.
-కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతక్క గెలుపు ఖాయమని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలుమల్లు ధీమా వ్యక్తం చేశారు. వడ్డెరకుల సంఘాల నేతలు ఆమె విజయానికి కలిసికట్టుగా కృషి చేస్తారని స్పష్టం చేశారు. పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌ను నమ్మబోమని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన తర్వాత వడ్డెరులకు రాజకీయంగా, ఆర్థికంగా తగిన ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తిచేశారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
మోకా ఇస్తే ధోకా చేసిన అధికార పార్టీకి బుద్ధిచెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడి ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంతటి ప్రాధాన్యం కలిగినందున ఇక్కడి ఓటర్లు సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు. చెయ్యి గుర్తుకు ఓటేస్తే బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి వస్తాయనే విషయాన్ని విస్మరించవద్దని కోరారు. ‘రౌడీషీటర్లను ఎన్నుకుంటారా? మీ తలలో నాలుకలా మెదిలి కష్టాసుఖాల్లో పాలుపంచుకున్న గోపన్న సతీమణి సునీతమ్మను ఆదరిస్తారా? కారు కావాలా? బుల్డోజర్లు కావాలా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోంచించండి’ అని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్సోళ్లు ఇచ్చే పైసలకు ఆశపడి, మాయమాటలు నమ్మి ఓటేస్తే నట్టేట మునగడం ఖాయమని స్పష్టంచేశారు. దోపిడీలకు తెరలేపి, హామీలను విస్మరించి మోసం చేసిన హస్తం పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజా వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేస్తూ తెలంగాణ ముస్లింలకు రేవంత్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ వక్ఫ్ చట్టం అమలవుతున్నట్టు రాహుల్ గాంధీకి తెలియడం లేదా? అని నిలదీశారు.
బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇకడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీని పొగుడుకుంటూ, ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ‘కేసీఆర్ హయాంలో మైనార్టీల కోసం 204 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశీ విద్యా సహాయం కింద ప్రత్యేకంగా రూ. 20 లక్షల సాలర్షిప్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు’ అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో వడ్డెరులతో పాటు నిరుపేదలకు గౌరవ మర్యాదలు దక్కాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బోరబండ, మాణికేశ్వర్‌నగర్ ప్రాంతాలు మూడు పువ్వులు ఆరు కాయాల్లాగా ఉండేవని, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అక్కడి వారికి చేతినిండా పనిదొరక్క ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను, జోగురామన్న, గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆదేశాల మేరకు వారి వృత్తులకు ఆర్థికసాయం చేశామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి నీడకల్పించామని పేర్కొన్నారు. కేసీఆర్ 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని తెచ్చి నగరవాసుల గొంతు తడిపారని గుర్తుచేశారు. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ స్కీంకు మంగళంపాడి బిల్లులు వసూలుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. పేదలెవరూ బిల్లులు కట్టవద్దని సూచించారు. బడుగు, బలహీనవర్గాల బిడ్డల కష్టాలు పోవాలంటే మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. ఇందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే నాందిపలుకాలని పిలుపునిచ్చారు.