హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయం అంచనాకు అనుగుణంగా పెరగడం లేదు కానీ, అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 33.49 శాతమే వచ్చింది. అప్పులు సుమారు 82 శాతానికి పెరిగాయి. తొలి అర్థ వార్షికానికి (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) సంబంధించిన ఆదాయ, వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు (CAG) రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదిక తాజాగా విడుదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయాన్ని రూ.2,29,720.62 కోట్లుగా ప్రతిపాదించారు. కానీ, సెప్టెంబర్ వరకు రూ.76,940.95 కోట్లు (33.49 శాతం) మాత్రమే వచ్చాయి. గత ఏడాది ఇదే కాలానికి 34.10 శాతం ఆదాయం రాగా, ఈ సారి అది మరింత తగ్గింది.
రాష్ట్ర సొంత ఆర్థిక వనరులైన ట్యాక్స్ రెవెన్యూ అనగా, జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటివి తగ్గాయి. బడ్జెట్లో ల్యాండ్ రెవెన్యూ 11.20 శాతం అంచనా వేయగా, ఆరు నెలల్లో 0.42 శాతం మాత్రమే వచ్చింది. పన్నుల ద్వారా రూ.1,75,319 కోట్లకుపైగా ఆదాయం ఆర్జిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ, అర్థ సంవత్సరంలో రూ.71,836 కోట్లు మాత్రమే (40.97 శాతం) మాత్రమే సేకరించారు. గత ఏడాది ఇదే కాలానికి 41.91 శాతం పన్నుల ద్వారా పిండుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్లు మార్కెట్ రుణాల కింద తీసుకుంటామని ప్రతిపాదించారు. కానీ, ఆరు నెలల్లోనే రూ.45,139.12 కోట్లు తీసుకున్నారు. అంటే అర్థవార్షికంలోనే 83.58 శాతం అప్పులు తీసున్నారు.
కాగ్ రిపోర్టులో ప్రధాన అంశాలు
2025-26 బడ్జెట్లో రెవెన్యూ రాబడి అంచనా- రూ.2,29,720.62 కోట్లు
సెప్టెంబర్ వరకు వచ్చింది- రూ.76,940.95 కోట్లు
బడ్జెట్ ప్రతిపాదనల మేరకు చేరిన లక్ష్యం- 33.49 శాతం
2025-26 బడ్జెట్లో రుణ సమీకరణ లక్ష్యం- రూ.54,009.74 కోట్లు
తొలి ఆరు నెలల్లో చేసిన అప్పులు- రూ.45,139.12 కోట్లు
బడ్జెట్ ప్రతిపాదనల మేరకు చేరిన- లక్ష్యం 83.58 శాతం