హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వచ్చే ఆదాయం, పోయే ఖర్చుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నాన్-ట్యాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంలో అధికార యంత్రాంగం విఫలమవుతున్నది. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఏటికేడు రాకెట్లా దూసుకెళ్లింది. 2015-16లో రాష్ట్ర సొంత రాబడుల (ఎస్‌వోఆర్) వృద్ధి 52.2 శాతం, రెవెన్యూ ఆదాయం 49.2 శాతం, మొత్తం రాబడులు 56.4 శాతం నమోదైంది. అదే రేవంత్‌రెడ్డి పాలనలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌వోఆర్ గ్రోత్ 2.2 శాతం, రెవెన్యూ ఆదాయం 2.5 శాతం, మొత్తం ఆదాయం 5.8 శాతం వద్దే ఆగిపోయింది.
ఆదాయం సృష్టించడంలో కేసీఆర్ పాలనకు, రేవంత్‌రెడ్డి పాలనకు పొంతన లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఆదివారం సచివాలయంలో నిర్వహించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్‌కమిటీ ప్రదర్శించిన తెలంగాణ 11 ఏండ్ల ఆదాయ గణాంకాలు వెల్లడించాయి. అందుకే ఆ సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార పన్నుయేతర ఆదాయం పెంచుకోవడంపై అధికారులు ప్రధానంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. అయితే, నాన్-ట్యాక్స్ రెవెన్యూ పెంపుపై సీరియస్‌గా దృష్టి సారించాలని ఆదేశించినప్పటికీ, గత రెండేండ్లుగా గణనీయమైన పురోగతి కనిపించకపోవడం ఆందోళనకరం. రెవెన్యూ తీసుకొచ్చే శాఖలు, డిపార్ట్మెంట్లు ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలంటే నాన్-ట్యాక్స్ రెవెన్యూ, కేంద్ర నిధుల సమీకరణ చాలా కీలకం. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల ద్వారా సేకరించే ఆదాయం ప్రధానం. వస్తుసేవల పన్నులో రాష్ట్ర వాటా, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆస్తి పన్ను, వాహనాల పన్ను, ఎక్సైజ్ డ్యూటీ. నాన్-ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రభుత్వ సేవల ద్వారా వచ్చే ఫీజులు (లైసెన్స్ ఫీజులు, పరీక్ష ఫీజులు, నీటిపారుదల ఫీజులు). ఈ రాబడులు రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చడానికి, అభివృద్ధి ప్రాజెక్టులు, పరిపాలనా ఖర్చులను భరించడానికి ఉపయోగపడతాయి. కానీ, సొంత రెవెన్యూ రాబడిలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. అసంబద్ధ, అనాలోచిత నిర్ణయాలతో గడిచిన రెండేండ్లలో రాష్ట్ర సొంత రెవెన్యూ వృద్ధి రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 2021-22లో 37.6 శాతం వృద్ధి నమోదైన సొంత రెవెన్యూ, 2023-24లో 7.2 శాతం, 2024-25లో కేవలం 2.2 శాతానికి పరిమితమైంది. మొత్తం రెవెన్యూ రసీదుల వృద్ధి కూడా 2022-23లో 13.8 శాతం ఉండగా, 2024-25లో 5.8 శాతానికే పరిమితమైంది. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయి.
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ గణాంకాలను బట్టి కొన్ని శాఖలకు అధిక నిధులు కేటాయిస్తుండగా, మరికొన్ని శాఖలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క సమావేశంలో స్వయంగా ఎత్తిచూపారు. అన్ని శాఖలకు, డిపార్ట్మెంట్లకు సమానంగా నిధులు పంచాలని, ఖర్చు అంతరాలను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ, ఈ సమస్యకు శాశ్వత పరిషారం లభించే సూచనలు కనిపించడం లేదు. నిధుల కొరతతో పలు శాఖలు అల్లాడుతున్నాయి. నిధుల లేమి బడ్జెట్కేటాయింపుల్లో అసమతౌల్యం, మొత్తంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గందరగోళం పరిస్థితిని తలపిస్తున్నట్టు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ఖర్చు చేయాలని, ఖర్చులను రేషనలైజ్ చేయాలని సర్కారు సూచించినప్పటికీ, ఆచరణలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని చెప్తున్నారు.