హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రూ. 950 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొనుగోలు కేం ద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని, ఇలా ఒకో క్విం టాల్‌కు 10 నుంచి 12 కిలోలు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. 10-12 శాతం ఎక్కువగా తీసుకుంటున్న ధాన్యం మిల్లర్లకు చేరుతున్నదని ఆరోపించారు.
ప్రభుత్వం ఈ సీజన్లో 1.3 కోట్ల టన్నుల ధాన్నాన్ని కొనుగోలు చేస్తున్నదని, ఈ లెక్కన 1300 టన్నుల ధాన్యాన్ని అధికంగా తీసుకుంటున్నట్టు అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఈ రశీదు లేని ధాన్యం మొత్తం విలువ సుమారు రూ.1600 కోట్లు అని తెలిపారు. ఇలా అధికంగా ధాన్యం ఇచ్చినందుకు మిల్లర్లు ‘యూ’ ట్యాక్స్ పేరుమీద మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, అధికారులకు ఎంత ఇస్తున్నారని ప్రశ్నించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇటీవలే రూ. 500 కోట్లు చేతులు మారాయని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇందులో రూ. 100 కోట్లను కేసీ వేణుగోపాల్‌కు పార్టీ ఫం డ్గా ఇచ్చారని ఆరోపించారు.
మిల్లర్ల నుంచి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి మొత్తం రూ.25వేల కోట్ల విలువైన బియ్యం రావాల్సి ఉన్నదని, బియ్యం మిల్లర్ల దగ్గర ఉంటే ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతున్నదని ప్రశ్నించారు. మిల్లర్లు రూ.450 కోట్లు పోగుచేసి రశీదు లేని పన్ను కట్టారని ఆరోపించారు. గతంలో చేతులు మారిన రూ.500కోట్లు కూడా కలిపితే ఇది మొత్తం రూ.950 కోట్ల కుంభకోణమని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తే రుజువు చేస్తానని చెప్పారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం.. మిల్లర్లు సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యంపై వివరాలు ఇవ్వాలని కమిషనర్ చౌహాన్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాఖల వారీగా ఎవరికి వారు టోల్ గేట్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలని ఆయన చూస్తున్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వంద రోజుల పాలనలో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించాం. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి నడిపిస్తున్నాం. వంద రోజుల పాలనలో అవినీతికి పాల్పడి యూ టాక్స్ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధం, దుర్మార్గం. నేను ప్రస్తుతం కుటుంబంతో దైవదర్శనం చేసుకోవడానికి వేరే రాష్ట్రానికి వచ్చాను. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వస్తా. వచ్చాక మహేశ్వర్‌రెడ్డి చేసిన అన్ని రాజకీయ ఆరోపణలకు జవాబు చెప్తా. – మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి