ములుగు: జిల్లాలో నేడు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ(Konda surekha), సీతక్క(Seethakka) పర్యటించనున్నారు. తాడ్వాయి మండలం మేడారంలో మేడారం మహా జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాగా, ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర (Sammakka Saralamma Jatara) నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు.
అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దలపైకి పూజారులు తీసుకొస్తారు. 22న గురువారం.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి.. గద్దెపై ప్రతిష్టిస్తారు. 23న శుక్రవారం.. వన దేవతలు గద్దెలపై కొలువుదీరుతారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయించి సమీక్షలు నిర్వహించినా ఇంకా కొన్ని పనులు పూర్తి కాలేదు. జాతరకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రులు మరోసారి ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.