హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ర్టానికి జరిగే అన్యాయంపై ప్రశ్నించేందుకు కాంగ్రెస్ నిర్వహించిన అఖిలపక్షం అభాసుపాలైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ హాల్లో జరిగిన అఖిలపక్ష సామావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశకుమార్గౌడ్కే సమాచారం ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను కూడా సమావేశానికి ఆహ్వానించలేదు. దీనిపై అఖిలపక్ష భేటీని ప్రభుత్వ సమావేశంలా నిర్వహించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అఖిలపక్ష భేటీకి తనకు ఆహ్వానం అందలేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్వయంగా వెల్లడించారు. అసలు అఖిలపక్ష సమావేశం ఉన్నట్టు తనకు సమాచారం లేదని, తెలిస్తే కచ్చితంగా హాజరయ్యేవాడినని అన్నారు. తమను కూడా పిలవలేదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పారు. సొంత పార్టీ అధ్యక్షుడిని పిలవకుండా, ప్రధాన పార్టీలను ఆహ్వానించకుండా దానికి అఖిలపక్ష భేటీ అని పేరు పెట్టడమేమిటని ఆయా పార్టీల నేతలు విమర్శించారు. సమావేశం అనంతరం సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఆహ్వానం అందని తనకు తెలియదని, అదంతా భట్టి విక్రమార్క చూసుకుంటారని తెలిపారు. ఇక తమిళనాడులో ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ నిర్వహించే సమావేశానికి తెలంగాణ తరపున అఖిలపక్ష నేతలు వెళ్తామని తెలిపారు.