హైదరాబాద్, మే 24(నమస్తే తెలంగాణ): రైతుల అనుమానమే నిజమైంది.. కాంగ్రెస్ సర్కార్ అన్నంత పనిచేసింది.. కొనుగోలులో తీవ్రమైన జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ కొనుగోలు ప్రక్రియనే బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రైతులు పండించిన పంటలో చివరిగింజ వరకూ కొంటామని గప్పాలు కొట్టిన సర్కార్ పెద్దలు.. ఇప్పుడు అర్ధంతరంగా చేతులెత్తేసే పనిలో పడ్డారు. కొనుగోలులో ఆలస్యం, నిర్లక్ష్యంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధాన్యం, మక్కలు ఇంకా కుప్పలుగా ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధాన్యం, మక్కల కొనుగోలును ఈ నెల 31తో ముగించాలని సర్కార్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ మేరకు ఆదివారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో కొనుగోలుకు గడువు విధిస్తూ జిల్లాల అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ గడువులోగానే వీలైనంత మేరకు ధాన్యం, మక్కలు కొనుగోలు చేయాలని, ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఆదేశించినట్టు తెలిసింది. సర్కార్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ధాన్యం, మక్కల కొనుగోలు ఇక కేవలం వారంరోజులపాటు మాత్రమే జరుగనున్నాయి.
రాష్ట్రంలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 50 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా 40 లక్షల టన్నుల ధాన్యం బయటే ఉన్నది. 43 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తికాగా ఇందులో 22 లక్షల టన్నుల కొనుగోలుకు సర్కార్ నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు 13 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఈ లెక్కన ఇంకా 9 లక్షల టన్నుల మక్కలు బయటే ఉన్నాయి. ఈ వారం రోజుల్లో ఎంత కొనుగోలు చేస్తారో? తెలియదు. మిగిలిన పంట కొనుగోలుకు ఎగనామం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలదాటినా కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంటలు కాంటా పెట్టని దుర్భర పరిస్థితులు ఉన్నాయి. గన్నీ సంచులు, వాహనాలు, గోదాములు, హమాలీల కొరత అంటూ సవాలక్ష కారణాలతో ధాన్యం, మక్కల కొనుగోలును కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది.
సగం పంటను కొనుగోలు చేసిన సర్కార్.. కొనుగోలు కేంద్రాలను బంద్ చేస్తే మిగిలిన సగం పంటను ఎక్కడ అమ్ముకోవాలి? అంటూ రైతులు లబోదిబోమంటున్నారు. కొనుగోలులో నిర్లక్ష్యానికి, తమకు కలుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యులు? అంటూ నిలదీస్తున్నారు. బహిరంగ మార్కెట్లో విక్రయిద్దామంటే కొనుగోలు చేసే దిక్కేలేదు. ఒకవేళ అమ్ముదామన్నా అడ్డికి పావుసేరు చొప్పున కొంటున్నారు. ధాన్యానికి మద్దతు ధర రూ.2,389 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.1,800కే కొనుగోలు చేస్తున్నారు. మక్కలకు మద్దతు ధర రూ.2,400 ఉండగా, మార్కెట్లో రూ.1,700-1900కే కొంటున్నారు. ఇలా ప్రైవేట్‌కు విక్రయించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాలు మూసివేయాలంటూ సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యానికి తోడు వానగండం రైతులను భయపెడుతున్నది. ముందే రుతుపవనాలు రావడం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం తదితర జిల్లాల్లో గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షం నుంచి తమ రాశులను కాపాడుకోవడం రైతులకు అతిపెద్ద సవాల్‌గా మారింది. తడిసిన పంటల కొనుగోలు మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి కొనుగోలులో వేగం పెంచాలని, పూర్తి పంట కొనుగోలు చేసే వరకు కేంద్రాలను తెరిచే ఉంచాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.