హైదరాబాద్, ఫిబ్రవరి6 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వే నివేదికను ప్రభుత్వం తాజాగా డెడికేటెడ్ కమిషన్కు అందజేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాలని నిర్ణయించింది. వాస్తవంగా స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ (6)ల ప్రకారం మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఇలా బీసీలు, ఇతర వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని, కమిషన్ సిఫారసులు లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించవద్దని తేల్చిచెబుతూ ట్రిపుల్ టీ పేరిట సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు జారీచేసింది.
అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. తాజాగా ఇంటింటి సర్వే నివేదికను ప్రభుత్వం కమిషన్కు అందజేసింది. తాజా బీసీ గణాంకాల ప్రకారం రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ ఖరారు చేయనున్నది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కమిషన్ 50 శాతంలోపు రిజర్వేషన్లు ఖరారు చేస్తుందా? లేదా బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సిఫారసు చేస్తుందా? అనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.