Atmiya Bharosa | హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తేతెలంగాణ): రైతు కూలీల ఖాతాల్లో జనవరి 26 నుంచి ఆత్మీయ భరోసా కింద రూ. 6వేల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని చూపిస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని 18,180 మంది లబ్ధిదారులకు పథకం ప్రారంభించిన తొలిరోజు ఆర్థిక సాయం అందజేసింది. అయితే తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో దీనిని సాకుగా చూపి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేసింది. ఎన్నికల నియామవళి వర్తించని గ్రామాల్లోనూ నగదు జమ చేయకపోవడంతో లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతున్నది.
ఆత్మీయ భరోసా పథకానికి సుమారు 5.80 లక్షల మంది అర్హులున్నట్లు గుర్తించి జాబితాలు విడుదల చేసింది. లిస్ట్‌లో పేర్లులేని అర్హుల కోసం గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించగా, 2.24 లక్షల మంది అర్జీలు పెట్టుకున్నారు. ఇందులో కేవలం 19,193 దరఖాస్తుదారులను మాత్రమే అర్హులుగా గుర్తించి, 1,44,784 దరఖాస్తులను తిరస్కరించారు. 59,542 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఇందులో సుమారు ఆరు వేల మందిని ఎంపిక చేయనున్నారు. అంటే మొత్తంగా 5.80 లక్షల మందితోపాటు అదనంగా 20 వేల నుంచి 25 వేల మందికి అంటే దాదాపు 6.5 లక్షల మందికి ఆత్మీయ భరోసాను వర్తింపజేయనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొదట రెండు, మూడు రోజులు రైతు భరోసాను నిలిపివేసింది. అయితే కొనసాగుతున్న పథకాలకు కోడ్ అడ్డంకి కాదని ఎలక్షన్ కమిషన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రైతు భరోసాను యథావిధిగా అమలు చేస్తున్నారు. కానీ ఆత్మీయ భరోసాను మాత్రం నిలిపివేశారు. దీంతో రైతు భరోసాకు లేని ఎన్నికల నిబంధనలు ఈ పథకానికి ఎందుకు వర్తిస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేకనే ఈ పథకాన్ని నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అర్హులందరీ ఖాతాల్లో రూ. 6వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.