హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలం గాణ): ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌పై తదుపరి చర్యలు తీసుకు నేందుకు గవర్నర్ అనుమతి కోసం ఏసీబీ అధికారులు గత సెప్టెంబర్‌లో లేఖ రాశారు. ఆ లేఖతో పాటు, కేసుకు సంబంధించిన వివరాలను గవర్నర్ ముందు ఉంచారు. ప్రభుత్వ ఆలోచనలను పరిగణలోకి తీసుకున్న గవర్నర్.. ఈ కేసులో తదుపరి విచారణకు అనుమతి ఇచ్చారు. ఫార్ములా ఈ-రేసు దర్యాప్తులో భాగంగా 2025 సెప్టెంబర్ 9న ఏసీబీ తన ఫైనల్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిలో కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరింది.
అవినీతి నిరోధక చట్టం-1988 (పీసీ యాక్ట్) ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా మాజీ మంత్రులపై అవినీతి కేసులు నమోదు చేయడానికి వీలు లేదు. దీంతో ఇప్పటికే కేటీఆర్‌ను ఏసీబీ, ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ప్రత్యక్షంగా.. ఎఫ్ఈఓ నిర్వాహకులను వర్చువల్‌గా విచారించారు. అయితే, గతంలో చేసిన విచారణలను పరిగణలోకి తీసుకొని చార్జిషీటు వేస్తారా? లేక ముందుగానే మరోసారి చివరిగా విచారణ జరుపుతారా? అనేది వేచి చూడాల్సి ఉంది.