హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి 5 ఎకరాల భూమిని కేటాయించడం సబబేనని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకున్నది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి వివిధ రూపాల్లో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి సోమవారం హైకోర్టులో వాదించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా మధ్యవర్తిత్వ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని ప్రతిపాదించిందని తెలిపారు. ఐఏఎంసీ ట్రస్టీలుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రెండో ట్రస్టీగా రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఉంటారని, అంతర్జాతీయ స్థాయిలో ఐఏఎంసీని ఏర్పాటు చేసినందున ప్రభుత్వం భూమిని కేటాయించిందని వివరించారు. ఐఏఎంసీ తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చాలా దేశాల్లో ఈ విధానానికి మంచి ఆదరణ లభిస్తున్నదని, మన దేశంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజన ధర్మాసనం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కక్షిదారులు కేసులను పరిషరించుకునే విధానాన్ని ప్రోత్సహించాలని ఈ విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డారు.