హైదరాబాద్, ఆగస్టు 14, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పెద్దమ్మ అమ్మవారి ఆలయం (జూబ్లీహిల్స్ కాదు) ప్రభుత్వ స్థలంలో ఉన్నందున కూల్చివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ భూమిలో ఆలయం ఉన్నదని, ఆ భూమి ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది. గత 45 ఏండ్లుగా ఉన్న ఆలయాన్ని ప్రభుత్వం గత నెల 24న కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పల్లె వినోద్‌కుమార్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో హైకోర్టు ప్రతివాదులైన జిల్లా కలెక్టర్, తహసీల్దార్ లకు నోటీసులు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహాన్ని భద్రం చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.