స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచేందుకే సిద్ధమవుతున్నది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తున్నది. మొత్తంగా బీసీలను ధోకా చేసే దిశగా కాంగ్రెస్ సర్కారు కుయుక్తులు పన్నుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా.. అదే రోజు లేదా తదుపరి రోజు క్యాబినెట్ భేటీ నిర్వహించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్తామనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు (Local Body Elections) వెళ్లేందుకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన 42శాతం కోటాకు (BC Reservations) భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24లోపు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వివరణ ఇచ్చింది. ఆలోగానే తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అనివార్యత ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ లోపే ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నంబర్ 9ని జారీచేసింది. గ్రామ పంచాయతీల్లో, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లో ఈ మేరకు రిజర్వేషన్ల అమలు కోసం 41, 42 జీవోలను కూడా విడుదల చేసింది. జీవోలకు అనుగుణంగా సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్‌ను జారీచేశారు. తొలివిడతలో రెండు దఫాలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రెండో విడతలో మూడు దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42%తో కలుపుకుంటే మొత్తంగా రిజర్వేషన్ 67% అవుతున్నదని, ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని, జీవో 9ని రద్దుచేయాలని మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్‌కు అనుకూలంగా కొందరు, ప్రతికూలంగా మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆ పిటిషన్లను తిరస్కరించింది. అక్టోబర్ 10న విచారణ జరిపిన హైకోర్టు.. 42% బీసీ రిజర్వేషన్ల జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది.
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ తర్వాత రెండు వారాల్లో రిప్లయ్ కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని అక్టోబర్ 18 న మరోసారి హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. నిర్ణయం ప్రకటించడానికి మరింత గడువు కావాలని కోరడంతో తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. 3న విచారణలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ, తమకు మరింత గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది. అప్పటిలోగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై పాత రిజర్వేషన్ల ప్రకారం.. అంటే బీసీలకు 25%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకెళ్లాలంటే జీవో నంబర్ 9ను, 41, 42 జీవోలను కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం ఓటరు జాబితాల్లో ఏటా ఒకసారి తప్పనిసరిగా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. మూడు నెలలకు ఒకసారి (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) క్వాలిఫైయింగ్ డేట్లతో కొత్త ఓటర్లను జోడించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేను 2024 నవంబర్ 6 నుంచి 25 వరకు నిర్వహించారు. ఈ లెక్కల ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారు. ఏడాది క్రితం అప్పటి జనాభా ప్రకారం రిజర్వేషన్లను కేటాయించినందున వాటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఒక సంవత్సరానికి జనాభా సుమారుగా ఐదు లక్షల పెరుగుదల ఉంటుందని అంచనా. ఆ ప్రకారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కూడా మార్పులు రానున్నాయి.
రాష్ట్రంలో పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పకోబోమని బీసీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, అదే లక్ష్యంగా ఏర్పాటైన బీసీ ఐక్యకార్యాచరణ సమితి ఇటీవల ఇచ్చిన రాష్ట్ర బంద్ విజయవంతమైన సంగతి తెలిసిందే. మేమెంతో.. మాకంత రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లను తగ్గిస్తామంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
కోర్టు ఒప్పుకోవడం లేదు. పాత పద్ధతిలోనే ఎన్నికలు పెడతామంటే బీసీ సమాజం ఒప్పుకోదు. ప్రొటెక్షన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి. ఎన్నికలు ఆలస్యమైనా ఇబ్బంది లేదు. కానీ, బీసీలకు అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తామంటే బీసీల ఆగ్రహంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది
– గంగుల కమలాకర్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే