యాచారం, జనవరి 4 : ఫ్యూచర్‌సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో 1,800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీ (తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ఆధ్వర్యంలో సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇప్పటికే భూ సేకరణకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. గ్రామంలోని అసైన్డ్ భూములను గుర్తించి హద్దులను నిర్ధారిస్తున్నారు. గత రెండు రోజులుగా పోలీసుల పహారాలో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ సర్వేను చేపడుతున్నారు. గ్రామంలోని 400 మంది రైతులకు చెందిన అసైన్డ్ భూములను సేకరించేందుకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి పర్యవేక్షణలో యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే చేస్తున్నారు.
గ్రామంలోని సర్వేనంబర్లు ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే చేస్తున్నారు. గ్రామంలోని సర్వేనంబర్లు 32, 78, 182, 222, 242లలో ఉన్న 1,800 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించేందుకు ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకోసం యాచారం, కందుకూరు, కడ్తాల మండలాల్లో మొత్తం 19,333 ఎకరాల భూమిని సేకరించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మేడిపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్ గ్రామాల్లో గతంలో 8వేల ఎకరాలను సేకరించగా, మరో 2,250 ఎకరాల పట్టా భూములను రైతులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. దీంతో ఆ భూములను ప్రభుత్వం నిషేధత జాబితాలో చేర్చింది. ఫార్మాసిటీ భూముల్లోనే ఫ్యూచర్‌సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం, అందుకోసం 33,000 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నది.
తాజాగా మండలంలోని మొండిగౌరెల్లిలోనూ సర్వే నంబర్లు 19, 68, 127లలోని 821ఎకరాలను సేకరించేందుకు సిద్ధ్దమైంది. కొంతమంది రైతులు అసైన్డ్ భూములను ఇచ్చేందుకు సిద్ధం కాగా, మరికొందరు ససేమిరా అంటున్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలోని పురాతనమైన ఓంకారేశ్వరాలయానికి నజ్దిక్ సింగారం గ్రామంలో 1,400 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని ఫ్యూచర్‌సిటీ కోసం సేకరించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మేడిపల్లి, నందివనపర్తి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, నల్లవెల్లి, నజ్దిక్‌సింగారం గ్రామాల్లోని అసైన్డ్ భూములపైనా ప్రభుత్వం నజర్ వేసినట్టు తెలిసింది.